IND vs PAK: పాకిస్తాన్‌పై టీమిండియా అరుదైన రికార్డ్: కాపాడుకుంటుందా..?!
అహ్మదాబాద్: ఇంకొన్ని గంటలు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కళ్ల ముందు ప్రత్యక్షం కాబోతోంది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మధ్యాహ్నం గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.
శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ తరువాత మళ్లీ భారత్- పాకిస్తాన్ ఢీ కొట్టబోతోండటం ఇదే తొలిసారి. ఈ రెండు జట్లకూ ఇది మూడో మ్యాచ్. ఈ టోర్నమెంట్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లల్లో తిరుగులేని విజయాలను సాధించాయి ఈ రెండు జట్లూ. భారత్.. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌లను మట్టికరిపించగా.. పాకిస్తాన్, నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించింది. తాజా మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా.. హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది.

భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్.. చీఫ్ గెస్ట్‌గా పాల్గొననున్నారు. ఇలాంటి ఓ కార్యక్రమానికి వారిద్దరూ అటెండ్ కాబోతోండటం ఇదే తొలిసారి. టాప్ ప్లేబ్యాక్ సింగర్ ఆర్జిత్ సింగ్ సైతం ఈ ప్రోగ్రామ్‌లో పెర్‌ఫార్మ్ చేయనున్నాడు.
ఈ మ్యాచ్‌కు కనివినీ ఎరుగని విధంగా భారీ భద్రతను కల్పించింది గుజరాత్ ప్రభుత్వం. భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. 6,000 మంది పోలీసులను మోహరింపజేసింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్.. బలగాలతో భద్రత కల్పించింది.
ఈ మ్యాచ్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. శనివారం మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగే వేడుకలకూ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. అమిత్ షా కొడుకు జై షా.. బీసీసీఐ కార్యదర్శి హోదాలో ఇందులో పాల్గొంటారు.

వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కు ఓ అరుదైన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. అన్ని మ్యాచ్‌లల్లోనూ విజయఢంకా మోగించింది. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఏడుసార్లు ఈ రెండు జట్లు తలపడగా.. అన్నిసార్లూ భారత్‌దే పైచేయి అయింది.
ఇప్పుడా రికార్డును కాపాడుకుంటుందా?, టీమిండియాపై ఈ వరస్ట్ రికార్డ్‌ను పాకిస్తాన్ కొనసాగిస్తుందా? అనేది ఆసక్తి రేపుతోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు తమ ప్రత్యర్థులను ఓడించిన తీరు చూస్తోంటే మరోసారి భారత్ గెలుపు ఖాయమే. కేప్టెన రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కుతోండగా.. దీనికి భిన్నంగా పట్టుమని 10 పరుగులు చేయలేకపోతున్నాడు అతని కౌంటర్‌పార్ట్ బాబర్ ఆజమ్.












Click it and Unblock the Notifications