టీమిండియాపై పోటీకి గట్టి పిండాలు
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ తో బిజీగా ఉంటోంది భారత జట్టు. ఇప్పటికే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ముగిసింది. దీన్ని 2-1 తేడాతో కోల్పోయింది. తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియాను ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ గట్టెక్కించింది. వైట్ బాష్ బారి నుంచి తప్పించింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. అగ్నికి వాయువు తోడైనట్టు విరాట్ కోహ్లీ సుడిగాలి ఇన్నింగ్ జత అయింది. ఫలితంగా- ఒక వికెట్ నష్టానికే 236 పరుగులను ఊది అవతలపడేసింది. ఇక అయిదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది.
ఈ పరిణామాల మధ్య టెస్ట్ సిరీస్ కూడా మొదలు కాబోతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిరీస్ ను గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. నవంబర్ 14న తొలి మ్యాచ్ మొదలవుతుంది. భారత్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం జట్టును ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డ్. మొత్తం 15 మంది సభ్యులు ఉన్న టీమ్ ఇది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ అందించిన కేప్టెన్ టెంబా బావుమా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు. మళ్లీ జట్టుకు నాయకత్వ పగ్గాలను అందుకున్నాడు.

గాయం కారణంగా పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ కు టెంబా బావుమా ఎంపిక కాలేదు. అతని స్థానంలో ఎయిడెన్ మార్క్ రమ్ జట్టుకు కేప్టెన్ గా వ్యవహరించాడు. రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో డ్రా చేసుకుంది. ఎడమ కాలి కండరాల గాయం నుంచి టెంబా బావుమా కోలుకున్నాడని క్రికెట్ బోర్డ్ తెలిపింది. వంద శాతం ఫిట్ నెస్ సాధించడంతో అతన్ని జట్టులో చోటు కల్పించినట్లు వివరించింది. కేప్టెన్ గా మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడని పేర్కొంది.
రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 14న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమవుతుంది. పాకిస్థాన్ పర్యటనకు ఎంపికైన జట్టులో ఉన్న డేవిడ్ బెడింగ్‌హామ్ మాత్రమే భారత్‌తో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. 2023లో టెస్టు కేప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు టెంబా. అప్పటి నుండి అతని నాయకత్వంలో దక్షిణాఫ్రికా ఒక్క టెస్టు కూడా ఓడిపోలేదు. అతని కేప్టెన్సీలో ఆడిన 10 టెస్టుల్లో దక్షిణాఫ్రికా తొమ్మిది గెలిచింది, ఒకటి డ్రా అయింది.
భారత్‌లో టెస్టు విజయం కోసం 15 ఏళ్ల నిరీక్షణను ముగించాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. 2010 ఫిబ్రవరి తర్వాత భారత గడ్డపై టెస్టు విజయం సాధించలేదా జట్టు. చివరిసారిగా నాగ్‌పూర్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ ను ఓడించింది. అప్పట్లో గ్రేమ్ స్మిత్ జట్టుకు సారథ్యాన్ని వహించాడు. ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో అప్పట్లో ఘన విజయం సాధించిందా టీమ్. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ రెండు జట్లు మధ్య అదే చివరి టెస్ట్ సిరీస్.
ఈ సిరీస్ లో- టెంబా బావుమా (కేప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రేవిస్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో జన్ సెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్ రమ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రయిన్ కు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications