Year Ender 2024: టీమిండియా చరిత్రలో చిరస్మరణీయం: ఎన్నో మెరుపులు- కొన్ని మరకలూ
Year Ender 2024 Team India: 2024.. భారత క్రికెట్ జట్టు చరిత్రలో చిరస్మరణంగా మిగిలిపోతుంది. ఎన్నో మెరుపులు, కొన్ని పరాజయపు మరకలు జట్టును పలకరించాయి. ఓ సగటు అభిమానిని భావోద్వేగాల్లో ఓలలాడించాయి. ఆనందం.. ఆగ్రహం సమంగా చవి చూడాల్సొచ్చిందీ ఏడాదిలో.
2007 తరువాత..
టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది టీమిండియా. ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచిన చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు అందుకోవడం ఇదే రెండోసారి. 2007లో తొలిసారిగా విజేతగా నిలిచింది. మళ్లీ ఇప్పుడే.

176 పరుగులు..
ఈ ఏడాది జూన్ 29వ తేదీ రాత్రి వెస్టిండీస్ బ్రిడ్జిటౌన్‌లో జరిగిన ఫైనల్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా చివరి బంతి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 169 పరుగలు వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం.
ఆదుకున్న కోహ్లీ, అక్షర్..
ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. 59 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 76 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది టాప్ ఆర్డర్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ న్యాయం చేశాడు. 31 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌తో 47 పరుగులతో రాణించాడు.
ఒత్తిడికి..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఒత్తిడికి లోనైంది. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ నిలదొక్కుకున్నారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 58 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్‌లో అదే అతిపెద్ద భాగస్వామ్యం. వారిద్దరూ అవుట్ అయ్యాక మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపినట్టనిపించింది గానీ హెన్రిచ్ క్లాసెన్ అడ్డు నిలిచాడు.
కాక పుట్టించిన క్లాసెన్
27 బంతుల్లోనే అయిదు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 52 పరుగులతో బౌలర్లను బెంబేలెత్తించాడు. అతను ఉన్నంత సేపూ మ్యాచ్‌పై ఆశల్లేవు. 151 పరుగుల వద్ద క్లాసెన్ అవుట్ కావడం టర్నింగ్ పాయింట్. భారీ షాట్లు ఆడే డేవిడ్ మిల్లర్ క్రీజ్‌లో ఉండటం కలవరపాటుకు గురి చేసినా చివరి ఓవర్ తొలి బంతికి అతనూ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది.
క్యాచ్ ఆఫ్ ది డికేడె..
గెలవడానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన దశలో పించ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ తొలి బంతికే అవుట్ కావడం హైలైట్. హార్దిక్ పాండ్యా వేసిన బంతిని వైడ్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు మిల్లర్. బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగిరి దాన్ని అద్భుతంగా అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఆ తరువాత ఇన్నింగ్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు.
ఆనంద భాష్పాలు..
మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్లవెంట ఆనంద భాష్పాలు జాలువారాయి. మ్యాచ్ గెలిచిన వెంటనే గ్రౌండ్‌ను ముద్దాడాడు. చిరస్మరణీయమైన విజయం కావడం వల్ల విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇలా టీమ్ మెంబర్స్ అందరూ భావోద్వేగులయ్యారు.
అలాంటి జట్టు ఘోర ఓటములు..
అలాంటి జట్టు ఆ తరువాత కొన్ని చేదు పరాజయాలను ఎదుర్కొంది. ప్రత్యేకించి- స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా ఓడిపోవాల్సొచ్చింది. ఆ టెస్ట్ సిరీస్‌ను 3-0 తేడాతో ఓటమి పాలైంది. బెంగళూరు, పుణే, ముంబైల్లో అచ్చొచ్చిన పిచ్‌లపైనా అత్యంత పేలవంగా ఆడింది టీమిండియా.












Click it and Unblock the Notifications