బాలకృష్ణ నిర్ణయం సరైనదా?

Balakrishna
హైదరాబాద్: హీరో నందమూరి బాలకృష్ణ వల్ల చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోగలదా? బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకోవడం ద్వారా నందమూరి హీరోలందరినీ మచ్చిక చేసుకోవచ్చన్న చంద్రబాబు నాయుడు వ్యూహం విజయవంతమైంది. కానీ కేవలం నందమూరి అందగాళ్ళ వల్ల తెలుగుదేశం పుంజుకుంటుందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

బాలకృష్ణ స్వతహాగా మంచివాడు. నిగర్వి. ఎన్టీఆర్ కు తన సంతానం అంతటిలోకి ఎంతో ఇష్టమైన వాడు బాలయ్య. "బాలయ్యే నా రాజకీయ వారసుడు" అని ఎన్టీఆర్ తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఇరవయ్యేళ్ళ క్రితమే తిరుపతిలో ప్రకటించారు. ఆ తర్వాత నాలుక కరుచుకుని తాను అలా అనలేదని సరిదిద్దుకున్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయల మీద తీవ్ర యుద్ధం చేస్తున్న ఆయన తాను కూడా కాంగ్రెస్ బాటలో పయనించకూడదని అలా ఖండించారే కానీ ఆయన తన తర్వాత బాలకృష్ణే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారన్నది స్పష్టం.

అయితే చంద్రబాబు నాయుడి తో రాజకీయంగా చేతులు కలపడం ద్వారా బాలకృష్ణ తన తండ్రికి ఆత్మశాంతి కలుగకుండా చేస్తున్నారా అన్నది ఆలోచించాల్సిన విషయం. ఎన్టీఆర్ ను గద్దె దించడానికి చంద్రబాబు నాయుడు పన్నిన మాయోపాయంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక పాత్ర వహించారు కానీ ఆనాడు బాలకృష్ణ తటస్ధంగా ఉండిపోయారు. అటువంటి స్ధితిలో ఎటువంటి కళంకాన్ని అంటించుకోని బాలకృష్ణ ఇప్పుడు చంద్రబాబుకు వంత పాడడం హార్డ్ కోర్ ఎన్టీఆర్ అభిమానులకు రుచించడం లేదు.

బాలకృష్ణ చంద్రబాబుకు బాసటగా బహిరంగంగా బయటికి రావడంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటి నందమూరి అందగాళ్ళు కూడా బాబాయి బాట పట్టక తప్పని పరిస్ధితులు అనేక కారణాల వల్ల ఏర్పడ్డాయి. కానీ ఇక్కడొక ముఖ్య విషయాన్ని సునిశితంగా పరిశీలించాలి. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల తర్వాత (ఒక వేళ విజయం సాధిస్తే) బాలకృష్ణకు కూడా చెక్ పెట్టరన్న గ్యారంటీ ఏముందని బాలయ్య అభిమానులు ఇప్పుడే ప్రశ్నించసాగారు. వారి సందేహాలు సమంజసమైనవేననిపిస్తోంది.

అయితే బాలకృష్ణకు పెద్ద రాజకీయ ఆకాంక్షలు ఉన్నట్టు కన్పించడం లేదు. గతంలో తన ఇంట్లో కాల్పుల కేసు రచ్చకెక్కినప్పుడు మాత్రం ఆయనకు రాజకీయాధికారం ఎంత శక్తమంతమైనదో అర్ధమైంది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, మరో మాజీ ముఖ్యమంత్రికి బావ మరిది అయినా బాలకృష్ణను ఆ కేసులో మొదట్లో పోలీసులు ముప్ప తిప్పలు పెట్టారు. తెలుగుదేశం పార్టీయే కనుక అధికారంలో ఉంటే పోలీసులు అంత సీన్ చేసి ఉండేవారు కాదు. పోయిన తండ్రి ఎన్టీఆర్ ఎటూ రారు, కనీసం చంద్రబాబు నైనా మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే తమ సువిశాల కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉంటుందన్న ఆలోచన బాలయ్య మదిలో బాగా పడిపోయిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

చిరంజీవి- పవన్ కళ్యాణ్ అభిమాల బలం ముందు నందమూరి అందగాళ్ళ బలం సరిపోతుందా? సరిపోదనే అంటున్నారు చిరంజీవి శిబిరంలోని మేధావులు. నందమూరి హీరోల వల్ల తెలుగుదేశం దిశగా ఒక కులం గట్టిగా నిలబడే అవకాశముందని, కామన్ పబ్లిక్ పై ఆ ప్రభావం పెద్దగా ఉండదని ఒక విశ్లేషణ. బాలకృష్ణ రెండు రకాలుగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నష్టం ఆయన కామ్ గా ఉంటే ఎన్టీఆర్ ఆత్మ శాంతికి భంగం కలిగి ఉండేది కాదు. రెండో నష్టం తెలుగుదేశంలో క్రియాశీలకం కావడం ద్వారా సినిమా కెరియర్ ను కోల్పోయే అవకాశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+