Satellite Internet: స్మార్ట్ ఫోన్లకు శాటిలైట్ ఇంటర్నెట్- ట్రాయ్ సంచలన ప్లాన్..!
భారత్ లో ఇంటర్నెట్ సేవల నాణ్యత ప్రశ్నార్ధకంగా మారుతున్న నేపథ్యంలో టెలికాం సేవల నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI)కేంద్రానికి ఇవాళ ఓ సంచలన ప్రతిపాదన చేసింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రతిపాదిస్తున్న మొబైల్ ఫోన్లకు శాటిలైట్ ఇంటర్నెట్ (Satellite Internet) అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. ఇప్పటివరకూ ఎయిర్ టెల్, జియో వంటి ఆపరేటర్లు సెల్ ఫోన్ టవర్ల ద్వారా ఇంటర్నెట్, కాల్ సేవలు అందిస్తుండగా.. ఇప్పుడు వాటిని నేరుగా శాటిలైట్ కు లింక్ చేయడం ద్వారా అందించాలని కేంద్రానికి ట్రాయ్ సూచించింది. దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్రస్తుతం మన దేశంలో ఎయిర్ టెల్, జియో వంటి సంస్థలు సెల్ ఫోన్ టవర్ల ద్వారా ఇస్తున్న ఇంటర్నెట్ నాణ్యతపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లోనే ఇంటర్నెట్ స్పీడ్ లేదన్న ఫిర్యాదులు రోజూ లక్షల్లోనే ఉంటున్నాయి. మారుమూల ప్రాంతాలకు వెళ్తే ఇంటర్నెట్ సంగతి తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్ కూడా దొరకదు. ఈ నేపథ్యంలోనే నేరుగా శాటిలైట్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడుకునే, కాల్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తామని స్టార్ లింక్ ముందుకొచ్చింది. అయితే ఇప్పటివరకూ స్టార్ లింక్ కు కేంద్రం పూర్తి స్ధాయిలో అనుమతులు ఇవ్వలేదు. దీనిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం నేరుగా శాటిలైట్ ద్వారా స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు వీలుగా ఓ విధానం తయారు చేయాలని ట్రాయ్ ఇవాళ సూచించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే స్టార్ లింక్ తో పాటు అమెజాన్ లియో, యూటెల్ శాట్ వన్ వెబ్, టాటా నెల్కో వంటి శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అంచనా. అలాగే ఇప్పటికే ఉన్న టెలికాం ఆపరేటర్లు ఎయిర్ టెల్, జియో, వీఐ వంటి కంపెనీలు కూడా తమ నెట్ వర్క్ కవరేజ్ విస్తరించుకోవచ్చని అంచనా. తాజా విధానం ప్రకారం శాటిలైట్ కంపెనీలు టెలికాం ఆపరేటర్లకు, ఇతర అర్హత కలిగిన సర్వీస్ ప్రొవైడర్లకు నెట్ వర్క్ మౌలిక సదుపాయాలు, సామర్ధ్యాన్ని అందించేందుకు వీలు కలుగుతుంది.














Click it and Unblock the Notifications
