హై ప్రోటీన్ మిక్స్‌డ్ మొలకల కుర్మా.. ఇలా చేస్తే రుచి, ఆరోగ్యం కూడా!
రొటీన్ కూరలతో విసిగిపోయి, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా రావటం లేదని బాధ పడేవారు మిక్స్‌డ్ మొలకల కుర్మా ఒకసారి ట్రై చెయ్యండి. మిక్స్‌డ్ మొలకల కుర్మా పరిమిత మసాలాలు, చాలా తక్కువ నూనెతో తయారయ్యే ఈ కూర రుచిగా ఉండటమే కాదు.. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా అందిస్తుంది. షుగర్, బీపీ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలనుకునే తల్లులకు ఇది చాలా మంచి ఎంపిక.
మొలకలు స్ప్రౌట్స్ సాధారణ పప్పుల కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. మొలకెత్తడం వల్ల ప్రోటీన్ జీర్ణం అవడం సులభం అవుతుంది. ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి వంటి పోషకాలు పెరుగుతాయి. రోజూ ఒక కప్పు మొలకలు తీసుకుంటే శరీరం బలంగా ఉంటుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది.

కావాల్సిన పదార్థాలు
మిక్స్‌డ్ మొలకలు - 1¼ కప్పులు
ఉల్లిపాయ తరుగు - అర కప్పు
టమాటాలు - 2 మీడియం
జీలకర్ర - ¼ చెంచా
కరివేపాకు - 1 రెమ్మ
పసుపు - ¼ టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి
కసూరి మేథీ - 1 టేబుల్ స్పూన్
గరం మసాలా - ¼ చెంచా
తాజా కొత్తిమీర - కొద్దిగా
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
వేడి నీళ్లు - అవసరమైనంత
కొబ్బరి పేస్ట్ కోసం:
పచ్చి కొబ్బరి ముక్కలు - ¼ కప్పు,
నల్ల మిరియాలు - ½ చెంచా,
తాజా అల్లం - 1 అంగుళం,
పచ్చిమిర్చి - 2-3,
జీలకర్ర - ½ టీస్పూన్,
పుదీనా ఆకులు - 15-20,
కొత్తిమీర - చిన్న గుప్పెడు.
తయారీ విధానం:
ముందుగా కొబ్బరి పేస్ట్ సిద్ధం చేసుకోండి. మిక్సీలో కొబ్బరి ముక్కలు, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోండి.కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు వేయండి. ఉల్లిపాయ తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. టమాటా తరుగు వేసి మగ్గించండి. ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసి కలపండి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసి 3-4 నిమిషాలు వేయించండి. పచ్చి వాసన పోయాక మిక్స్‌డ్ మొలకలు వేసి 2 నిమిషాలు కలపండి.
వేడి నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వండి.ఆవిరి పోయాక మూత తీసి, కసూరి మేథీ నలిపి వేయండి. కొత్తిమీర, గరం మసాలా వేసి ఒక్క ఉడుకు రానివ్వండి. అంతే.. నోరూరించే మిక్స్‌డ్ మొలకల కుర్మా రెడీ అవుతుంది. వేడి వేడి చపాతీ, ఫుల్కా, జొన్న రొట్టె లేదా సాదా అన్నంతో సర్వ్ చేయండి. కొంచెం నిమ్మరసం పిండితే రుచి మరింత పెరుగుతుంది.
మొలకలు ఇంట్లోనే తయారుచేసుకుని ఈ కూర వండుకు తింటే ఆరోగ్యం. ఈ కూరను వారానికి 2-3 సార్లు తయారు చేసుకుంటే శరీరానికి మంచి ప్రోటీన్ లభిస్తుంది. రుచి, ఆరోగ్యం రెండూ ఒకేసారి దక్కే ఈ మిక్స్‌డ్ మొలకల కుర్మాను ఇంట్లో తప్పక ట్రై చెయ్యండి.













Click it and Unblock the Notifications
