'కాంగ్రెస్ హీరోలు'

నాగార్జున వల్ల కాంగ్రెస్ కు జరిగే మేలు కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నాగ్ స్టూడియోకు జరిగిన మేలు ఎక్కువన్న విషయం స్పష్టంగా కనిపిస్తున్నదే. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కు మంచి మిత్రుడుగా కొంతకాలం ఉన్నప్పటికీ 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైరం మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్ కు దిగువన ఉన్న భూమిని అక్కినేని సినిమాల కోసం కాకుండా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారన్న అరోపణల మీద ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తీవ్రంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు. అయినా ఆ భూమి ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియో కిందనే ఉంది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఆ భూమిని అక్కినేనికి ఇచ్చిందో, ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా వాడుకోవడం నిబంధనలకు విరుద్దం.
అన్నపూర్ణ స్టూడియో భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద రెగ్యులరైజ్ చేసింది. నాగార్జున ప్రభుత్వ పథకాలను పొగుడుతూ టీవీ యాడ్స్ లో నటించినందుకు దాదాపు 150 కోట్ల మేరకు లాభం చేకూరింది అక్కినేని కుటుంబానికి. మహేష్ బాబు ను చూపించి, హీరో కృష్ణ కూడా పద్మాలయా స్టూడియోస్ భూమిని ఇదే విధంగా రెగ్యులరైజ్ చేయించుకుని దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు లాభం పొందారు.
మరి తెలుగుదేశం పార్టీకి అండగా ముందుకు వచ్చిన నందమూరి అందగాళ్ళకు దక్కినది ఏమిటి? బాలకృష్ణ, బాబుకు వియ్యంకుడయ్యారు కాబట్టి వారి ఆస్ధుల లావాదేవీలు పూర్తిగా అంతర్గతం. మరి కళ్యాణ్ రామ్, తారకరత్నలకు దక్కేదేమిటి? ఆ పార్టీకి అంటీ ముట్టనట్టు ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ కు దక్కనిది ఏమిటి? ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కానీ ఈ ప్రశ్నలకు జవాబులు దొరకవు.
కాంగ్రెస్ నుంచి భారీ ఫేవర్లు పొందిన నాగార్జున, మహేష్ బాబులు ఆ పార్టీ తరఫున ప్రత్యక్షంగా ప్రచారం చేయడం లేదు. మరి కాంగ్రెస్ ను జరిగే లాభం ఏమిటి? తెర వెనుక జరిగిన తతంగం ఏమిటి? హీరోలు ఇంత తెలివిగా పనులు చేయించుకోవడం విశేషమే. హీరో వెంకటేష్ కు ప్రభుత్వంతో పనిలేనట్టుంది. రామానాయుడు ఎటూ వైజాగ్ లో స్ధలం కోసం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నట్టు నటిస్తున్నారు కాబట్టి వెంకటేష్ ను చూపించవలసిన అవసరం లేదు.












Click it and Unblock the Notifications