పార్టీల 'కులాహలం'

ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ గా నిన్న ఒక రెడ్డి అధికారిని నియమించారు. సీనియర్ అయిన ఒక నాన్ రెడ్డి అధికారిని పక్కన పెట్టి ఈ నియామకం చేయడంతో అటవీశాఖ ఉద్యోగులు "క్యాస్ట్ ఫ్యాక్టర్" అని సరిపెట్టుకున్నా, లోలోపల ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం. రెడ్డి కులానికి చెందిన ఒక రిటైర్డ్ డిఎస్పీని తిరుమల తిరుపతి దేవస్ధానంలో ఒక ముఖ్యమైన పదవిలో నిన్ననే నియమించారు. ఎసిబి దాడులు కూడా ఎక్కువగా నాన్ రెడ్డి అధికారుల మీదనే జరుగుతున్నాయని, టిడిపి హయాంలో నాన్ కమ్మ అధికారుల మీద ఎక్కువగా దాడులు జరిగాయని ఉద్యోగ సంఘాల నాయకుల్లో కొందరు మీడియా ప్రతినిధుల వద్ద ప్రైవేటు సంభాషణల్లో బయట పడుతున్నారు.
చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి చంద్రశేఖరరెడ్డి, అరడజనుకు పైగా వైఎస్ చాన్సలర్లు రెడ్లు. సచివాలయంలో రాయలసీమకు చెందిన రెడ్డి అధికారులే చక్రం తిప్పుతున్నారు. తెలుగుదేశం హయాంలో కమ్మ అధికారులు ఒక వెలుగు వెలిగారు. కులాల ప్రాతిపదికగా ఇలా ఆయా ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వెళ్ళడం సమాజంలోని మిగితా వర్గాలను కించపరచడమే అవుతుంది.
కొసమెరుపు: ఇటీవలే వచ్చిన చిరంజీవి పార్టీకి కూడా కుల జాఢ్యం పట్టింది. పార్టీలోని వివిధ కమిటీలలో అధిక భాగం పదవులు కాపులకే దక్కాయి. ముఖ్యంగా మీడియా కమిటీలకు నేతృత్వం వహిస్తున్న ముగ్గురూ కాపులే కావడం విశేషం.












Click it and Unblock the Notifications