రామోజీ ప్రతీకారం!

భారీ నష్టానికి సిద్ద్గపడి (రోజుకి యాభై లక్షలకు పైగా లాస్) వైఎస్ తనయుడు జగన్ ముచ్చటగా పెట్టుకున్న "సాక్షి" దిన పత్రికకు త్వరలో ఇబ్బందులు రానున్నాయి. అన్నీ పంచరంగులతో వస్తున్న "సాక్షి" అమ్మకం రేటు రెండు రూపాయలే. కానీ ఒక కాపీకి న్యూస్ ప్రింట్ (పేపర్), ఓవర్ హెడ్స్, ప్రింటింగ్, రవాణా, అమ్మకపు కమిషన్ కలుపుకుంటే పన్నెండు రూపాయలు ఖర్చవుతుంది. సాక్షి ఇప్పుడు సర్క్యులేషన్ రీత్యా నెంబర్ వన్ అనడంలో సందేహం లేదు. ఈ పత్రిక ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఎబిసి) నుంచి నెంబర్ వన్ అనే సర్టిఫికెట్ తెచ్చుకుంటే తప్ప వాణిజ్య ప్రకటనలు భారీగా వచ్చే అవకాశం లేదు.
ఈనాడు ఎండీ, రామోజీరావు కుమారుడు కిరణ్ ఈసారి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ కమిటీకి చైర్మన్ అయ్యారు. దేశంలోని ప్రధాన పత్రికల యజమానులు ఎబిసికి ఒక నిర్ణీత కాలం పాటు అధ్యక్షులుగా ఉంటారు. ఎబిసి అధికారికంగా సర్టిఫికెట్ ఇవ్వకుండానే తాము 13 లక్షల సర్క్యులేషన్ తో తెలుగులో నెంబర్ వన్ స్ధానంలో ఉన్నామని సాక్షి పత్రిక వివిధ సందర్భాల్లో రాసుకుంది. అది ఎబిసి కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం. ఈ మేరకు ఎబిసి చైర్మన్ హోదాలో రామోజీరావు కుమారుడు కిరణ్ సాక్షి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, వైఎస్ ముఖ్యమంత్రి అయితే రామోజీరావు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాంగ్రెస్ ఓడిపోతే సాక్షి తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కోవలసి ఉంటుంది. కాంగ్రెస్ గెలిచినా, వైఎస్ ముఖ్యమంత్రి కాకపోయినా సాక్షికి ఆ ఇబ్బంది తప్పదు.
రామోజీరావు అటువైపు నుంచే కాకుండా చిరంజీవికి విపరీతమైన ప్రచారం ఇవ్వడం ద్వారా వైఎస్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎన్నికల ముందే కాకుండా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ను అధికారంలోకి రానివ్వకుండా తెలుగుదేశం, టీఆర్ ఎస్, ప్రజారాజ్యం, వామపక్షాలతో ఒక విశాలమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేలా చూడడానికి రామోజీరావు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నట్టు సమాచారం. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అనే సామెతను గుర్తు చేసుకుంటే ఈ ఎత్తులు పై ఎత్తులు బాగా అర్ధమవుతాయి.
మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో తనను ముప్పతిప్పలు పెట్టిన కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీద కూడా న్యాయ యుద్ధానికి రామోజీరావు శ్రీకారం చుట్టారు. ఉండవల్లి చేసిన దుష్ప్రచారం వల్ల మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధ నష్టపోయిందని, అందుకు పరువు నష్టం దావాను రామోజీరావు దాఖలు చేశారు. రానున్నది పాండవ కౌరవ యుద్ధమా? కౌరవ పాండవ యుద్ధమా? ఈ పేజీని మీ మిత్రులకు పంపి వారి అభిప్రాయాలను పంచుకోండి.












Click it and Unblock the Notifications