చిరంజీవి-కొన్ని లక్షణాలు

తిరుపతిలో చిరంజీవి బస చేసిన హోటల్ గదుల్లో నేడు పోలీసులు సోదా చేశారు. చిరంజీవి పార్టీ వాళ్ళు డ్వాక్రా మహిళలకు డబ్బు పంచుతున్నారని అధికార కాంగ్రెస్ వాళ్ళు ఇసికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరు రూమ్ పక్కనే ఉన్న రామ్ చరణ్, సుస్మితల రూములను పోలీసులు క్షుణ్ణంగా సోదా చేశారు. చిరంజీవి గదిని మాత్రం పోలీసులు టచ్ చేయలేదు. మీడియా ఎదుట తన గది సోదా చేయమని చిరంజీవి కోరినా పోలీసులు వెళ్ళిపోయారు. దీనిని బట్టి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కన్పిస్తోంది. మరో రాష్ట్ర స్ధాయి రాజకీయనాయకుడైతే వెంటనే రోడ్డెక్కి తన నిరసనను తెలియజేసి ట్రాఫిక్ ను స్తంభింపజేసి ఉండేవాడు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించకుండా నిరసన తెలిపే విధానం గురించి తెలుసుకుని రాజకీయమంటే ఏమిటో, ప్రజా నాయకుడి జోలికి పనిగట్టుకుని వస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చేసి చూపించేవాడు.
చిరంజీవి ఎన్నికల తర్వాత కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా ఆయన మెతక స్వభావాన్ని వీడకపోతే లాభం ఉండదు. మెత్తగా ఉంటే పిల్లినైనా ఎలుక వెక్కిరించి వెళుతుంది. సినిమాలు వేరు, రాజకీయం వేరు అన్న సత్యాన్న్ని చిరంజీవి గ్రహించాలి. ఎన్టీ రామారావు ప్రవర్తన సినిమారంగంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా రాజకీయాల్లో ఉన్నప్పుడు దానికి అనుగుణంగా ఉండేది. అవినీతిపరుడైన ఐఎఎస్ అధికారుల మొహం మీదికి ఫైల్స్ విసిరిగొట్టగల ధైర్యం, నైతిక స్ధైర్యం ఎన్టీఆర్ లో ఉండేవి. చిరంజీవి అలా చేయగలరా? వెనుక నుంచి ఎవరో చెబితే ఆ మాటలనే చిలక పలుకుల్లా వల్లిస్తారా?
పద్దెనిమిదేళ్ళ క్రితం నెల్లూరు జిల్లాలో ఒక విమానం కూలిపోయింది. నెమ్మదిగా వరిపొలాల మీద వాలిపోయింది కాబట్టి సరిపోయింది. ఆ విమానంలో చిరంజీవి ఉన్నారు. ఆ పరిణామానికి ఆయన తీవ్రంగా భయపడ్డారు. ఆ విషయం ఒక టాప్ తెలుగు దినపత్రికలో వచ్చింది. సినిమాలలో వంద మందిని ఒంటి కాలితే తన్ని తగలేసే హీరో ఇలా భయపడిపోవడమేమిటని జనం అనుకుని ఉండవచ్చు. చిరంజీవి కుటుంబానికి చెందిన ఒక పెద్ద మనిషి నుంచి ఆ పత్రికాధిపతికి కాల్ వెళ్ళింది. యాక్సిడెంట్ స్పాట్ లో చిరంజీవి కన్నీళు పెట్టుకోలేదని, అందుకు సంబంధించిన వివరణ ప్రచురించాలని అభ్యర్ధన. తమ విలేకరి వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వివరణ ప్రచురించాల్సిన అవసరం తమకు లేదని ఆ పత్రికాధిపతి సదరు పెద్ద మనిషికి స్పష్టం చేశారు. ఆ డ్యామేజిని కవర్ చేసుకోడానికి సినిమా పత్రికల ద్వారా అనేక ప్రయత్నాలు జరిగాయి.
ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా చిరంజీవి రాజకీయాలనే ఫుల్ టైమ్ గా పెట్టుకోవాలి. ఆయన ఇంకా కొన్ని నెలల ముందే పార్టీ పెట్టి ఉంటే ఇప్పుడాయనని పార్టీ నెంబర్ వన్ గా ఉండేది. కాంగ్రెస్, టీడీపీల అవినీతిని ఈసడించుకుంటున్న ప్రజలకు ఆయన ఒక పెద్ద మార్పు తెచ్చే దేవుడిగా కన్పించి ఉండేవారు. అతి విశ్వాసం, వంది మాగధుల వల్ల ఆయనకు ఆ అవకాశం రాకుండా పోయింది. ప్రతిపక్ష నాయకుడిగానైనా చిరంజీవి ప్రజల ఆకాంక్షలను నెరెవేరుస్తారని ఆశిద్దాం.












Click it and Unblock the Notifications