చిరు వేసేది 'సిఎం పాత్రా'?

ప్రజారాజ్యాన్ని వీడిపోయి, ఆ పార్టీ పరువును బజారుకెక్కించిన పరకాల ప్రభాకర్ మాత్రం చిరంజీవికి పది అసెంబ్లీ స్ధానాలకు మించి రావని గట్టిగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ మేధావులు మాత్రం చిరు పార్టీని తక్కువగా అంచనా వేయడం లేదు. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు చిరంజీవి ప్రభావం గణనీయంగా ఉంటుందని, ఈ జిల్లాల్లో చిరుకు 40 వరకు అసెంబ్లీ స్ధానాలు వస్తాయని కాంగ్రెస్ వారు వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఒక అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ కు 120కి పైగా స్ధానాలు వస్తాయని, అప్పుడు చిరంజీవి మద్దతు తమకు కీలకమౌతుందని కాంగ్రెస్ వర్గాలు ప్రైవేటుగా చెబుతున్నాయి.
మరీ తక్కువ స్ధానాలు వస్తే తిరిగి సినిమా రంగంలోకి వెళ్ళిపోవాలని ఒక దశలో చిరంజీవి అనుకున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. అసెంబ్లీలో కూర్చుని సమయం వృధా చేసుకోవడం కంటే తాను చేయదలచుకున్న చారిత్రక పాత్రలను పోషించి జీవితాశయం నెరవేర్చుకోవాలని చిరంజీవి అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆయన "ముఖ్యమంత్రి" పాత్రనే పోషించాలని, అందుకోసం అవసరమైతే మరో ఐదేళ్ళు వేచిఉండాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఏమైనా చిరంజీవి ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలప పాత్ర పోషించడం ఖాయం.












Click it and Unblock the Notifications