రాజు- రామోజీ!

దాదాపు రెండు వేల ఎకరాలతో తానే పెద్ద ల్యాండ్ లార్డ్ ని అని భావిస్తున్న రామోజీకి రామలింగరాజు భూముల చిట్టా ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఆ భూముల్లో అధిక భాగం నగరానికి దగ్గరగా ఉండడం వల్ల ఎంత లేదన్నా వాటి విలువ పదివేల కోట్ల పైమాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. రామోజీరావు సంప్రదాయికంగా వ్యాపారం చేయకుండా కార్పొరేట్ స్టయిల్ కి వచ్చి తన గ్రూపు సంస్ధల పబ్లిక్ ఇష్యూ చేసి ఉంటే, మార్కెట్ మాయాజాలం ద్వారా కొన్ని వేల కోట్లు అదనంగా సంపాదించుకుని ఉండే వారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒక రకంగా రామోజీ అలా చేయకపోవడమే మంచిదని, పరుగెత్తి పాలు తాగిన రామలింగరాజు పరిస్ధితి ఏమైందని కొందరి విశ్లేషిస్తున్నారు.
రాజకీయాలకు దూరంగా, మౌనంగా వ్యాపారం, పైకీ సంఘ సేవ చేసిన రామలింగరాజు చాపకింద నీరులా నగరం చుట్టూ భూములను చుట్టబెట్టారు. రాజుపై ఇప్పుడు మావోయిస్టుల దృష్టి పడింది. గతంలో రామోజీరావుకు కూడా మావోయిస్టులు బెదిరింపు లేఖలు రాశారు. రామలింగరాజు కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి సంపాదించుకున్నవేనని మావోయిస్టులు ప్రకటన జారీ చేశారు.
సత్యం ఉద్యోగుల శ్రేయస్సు గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ లు ఈనాడు సంస్ధ మీద వత్తిడి పెంచినప్పుడు ఆ గ్రూపు సంస్ధల్లో పనిచేస్తున్న దాదాపు ఆరేడు వేల మంది ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడాలని అన్పించడం లేదో? వారికి రామలింగరాజు పాడి గేదెలా, రామోజీరావు సూడి గేదెలా కన్పించి ఉంటారా? ఏమో మరి...












Click it and Unblock the Notifications