రాష్ట్రం విడిపోక తప్పదా?

నవంబర్ 1వ తేదీ రాష్ట్రావతరణ దినోత్సవాల తీరు ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య సాధ్యం కాదనే విషయాన్ని చాటుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర విభజన ఎలా జరగాలనే చర్చ కూడా ప్రారంభమైంది. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలా, ఉమ్మడి రాజధానిగా చేయాలా అనే ఆలోచనలు కూడా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చెలరేగుతున్న ఊహాగానాలు కూడా పరిస్థితిని విషమింపజేస్తున్నాయి.
నవంబర్ 1వ తేదీన సీమాంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాన్ని బట్టి చూస్తే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య కూడా అనుమానాలు, భయాందోళనలు, విద్వేషాలు తలెత్తే ప్రమాదం ఏర్పడిందని అర్థమవుతుంది. భౌగోళికంగా కలిసి ఉంచినా ఇరు ప్రాంతాల ప్రజలు, నాయకుల మధ్య మనసులను కలపలేని వాతారవరణం ఏర్పడింది. అన్ని విషయాల్లోనూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఒక్క అంశమని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఎప్పుడు ఏ వివాదం చెలరేగి తెలంగాణలో ప్రజలు వీధుల్లోకి వస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఈ ఆందోళనలు కూడా కట్టడి చేయలేని స్థితికి ప్రభుత్వం చేరుకుంది. అన్ని పార్టీల నాయకులు ఆ ఆందోళనలకు మద్దతు తెలియజేయాల్సిన అనివార్యతలో పడడం వల్ల కట్టడి చేయడం ప్రభుత్వానికి అంత సులభం కాదు.
తెలంగాణకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులను కట్టడి చేసి, బలప్రయోగం చేస్తే తప్ప పరిస్థితిని అదుపులోకి తేలేని స్థితి ఏర్పడింది. ఆలా చేయడం వల్ల ఏ రాజకీయ పార్టీ ఏ మేరకు నష్టపోతుంది, ఏ రాజకీయ పార్టీ ఏ మేరకు లాభం పొందుతుందనేది కూడా ప్రధాన విషయంగా మారింది. తమకు నష్టం జరిగే పనిని అధికార కాంగ్రెసు పార్టీ చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ నాయకుల మనుగడ ఆధారపడి ఉంది. దీంతో తప్పనిసరిగా ఆందోళనలకు మద్దతు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఎంత బలమైన నాయకుడు వచ్చినా పరిస్థితిని చక్కదిద్దడం సులభం కాదు.












Click it and Unblock the Notifications