పవన్ కళ్యాణ్ కూడా వస్తారా?

పార్టీ స్థాపనకు ముందు అభిమానుల సమావేశాలు ఏర్పాటు చేసి రంగం సిద్ధం చేసిన నాగబాబు మళ్లీ అభిమానుల సమావేశాల నిర్వహణలో బిజీగా ఉన్నారు. అధికారం దక్కకపోవడంతో చిరు అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. వారికి విశ్వాసం నూరిపోయడానికి నాగబాబు ప్రయత్నిస్తున్నారు. అభిమానులకే పెద్ద పీట వేస్తామని నమ్మబలుకుతున్నారు. అల్లు అరవింద్ మళ్లీ ప్రజారాజ్యం ప్రధాన కార్యదర్శిగా ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధపడ్డారు. తాను గేట్ కీపర్ గా వ్యవహరిస్త్తానని ఆయన చెప్పారు.
ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ ను తిరిగి బుజ్జగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆయన అన్నయ్య కోసం తిరిగి రావడానికి సిద్ధంగానే ఉంటారని చెబుతున్నారు. కొమరం పులి వివాదంలో అల్లు అరవింద్, చిరంజీవి పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు. కుటుంబమంతా కలిసే ఉందని, చిరంజీవితోనే తాము ఉన్నామని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్ల ప్రజారాజ్యం పార్టీలో తన ఉనికి చూపించి, అన్నయ్యకు అండగా నిలుస్తున్నట్లు అభిమానులకు చాటాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఏదో ఒక సమయంలో వీలు చూసుకుని తన రీఎంట్రీని ప్రదర్శిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications