డిప్యూటీ సిఎం కోసమే చిరంజీవి?

జగన్ వెంట వెళ్లే శాసనసభ్యులు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తే తాము ఆదుకుంటామని చిరంజీవి చెబుతూ వస్తున్నారు. అయితే, ఆయన మంత్రివర్గంలో ప్రధాన వాటాను కోరుతున్నారు. కనీసం ఆరు మంత్రి పదవులు కావాలనేది చిరంజీవి డిమాండ్. కానీ కాంగ్రెసు నాలుగు మంత్రి పదవులు మాత్రమే ఇవ్వడానికి సిద్ధపడింది. దానికితోడు, చిరంజీవి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఆశలపై నీళ్లు చల్లడానికే ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే హడావిడిగా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారని అంటున్నారు. దీంతో చిరంజీవి ఆశలకు కళ్లెం పడింది. ఈ కారణంగానే ఆయన ప్రభుత్వంలో చేరడానికి విముఖత ప్రదర్శించారని అంటున్నారు.
తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన కాంగ్రెసు అధిష్టానం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం చిరంజీవేనని అంటున్నారు. ప్రభుత్వం పడిపోయే స్థితి వస్తే చిరంజీవిని ప్రభుత్వంలో చేర్చుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే చిరంజీవికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అనివార్యతలో పడవచ్చుననే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి పదవి భర్తీని పెండింగులో పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే, ఉప ముఖ్యమంత్రి పదవి సాధ్యం కాదని కాంగ్రెసు అధిష్టానం చిరంజీవికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. కానీ చిరంజీవి వెనక్కి తగ్గడానికి సుముఖంగా లేరు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తన తనతో పాటు 14 మంది శాసనసభ్యుల మద్దతు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటుందని ఆయన చెబుతున్నట్లు సమాచారం. ఏమైనా, చిరంజీవి పట్టు అంతా ఉప ముఖ్యమంత్రి పదవిపైనేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications