అన్నా ఎపిసోడ్: కెసిఆర్‌కు విరుగుడు

అన్నా హజారేకు మద్దతుగా విద్యార్థులు పెద్ద యెత్తున రోడ్ల మీదికి వస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బిజెపి నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఏకంగా ఆందోళనకే శ్రీకారం చుట్టారు. తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రవాదులు దీన్ని ఆయుధంగా వాడుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. విశాఖపట్నంలోని విద్యార్థులు ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం పనికి వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని బట్టి తెలంగాణ ఉద్యమం అన్నా హజారే ఉద్యమం వల్ల వెనకబడిపోయేట్లే ఉంది.
అన్నా హజారే అరెస్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే దేశప్రజల దృష్టిని ప్రధానంగా ఆకర్షిస్తుంది. తెలంగాణ ఉద్యమం వైపు దృష్టి మళ్లించి, మీడియాను ఆకట్టుకోవడం కూడా సాధ్యం కాదు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్న తెలుగు మీడియా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమాన్ని వాడుకునే అవకాశాలున్నాయి. తెలంగాణకు ప్రాధాన్యం తగ్గించడానికి ఇది అవకాశంగా దొరికిందని అంటున్నారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద అన్నా హజారేకు మద్దతుగా చేపట్టిన ప్రదర్శనకు వచ్చిన కోదండరామ్‌ను అడ్డుకోవడం కూడా ఇందుకు సూచనగా భావించవచ్చు. మొత్తం మీద, కెసిఆర్‌కు అన్నా హజారే ఉద్యమం ఆటంకంగా మారుతుందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications