పాక్ క్రికెట్‌ను మార్చేసిన ఆఫ్రిదీ

ఆఫ్రిదీ గమ్మత్తయిన ఆటగాడు కూడా. అతనిలో ఆట పట్ల కసి కనిపిస్తుంది. మైదానంలో ఉన్నంత సేపు అతను ఆట గురించి తప్ప మరో ఆలోచన చేయడు. ప్రత్యర్థి జట్టు ఎంతటి సత్తా కలదైనా దాన్ని ఓడించి తీరాలనే పట్టుదల అతనిలో కనిపిస్తుంది. ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి అతన్ని గమనిస్తున్న వాళ్లు ఆ విషయాన్ని తప్పకుండా అంగీకరిస్తారు. లుకలుకలతో పాకిస్తాన్ జట్టు ఏం ఆడుతుంది లే అనుకున్నవాళ్ల నోళ్లు మూయించాడు.
పాకిస్తాన్ జట్టు గ్రూప్ ఎలో టాప్‌లో నిలిచిందంటే ఆ కీర్తి ఆఫ్రిదీకి దక్కాల్సిందే. ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఇంటికి పంపిన తర్వాత గానీ ఆఫ్రిదీ నాయకత్వ పటిమ ఏమిటో తెలిసి వచ్చింది. అంతేకాకుండా, లీగ్ మ్యాచుల తొలి దశలో పాకిస్తాన్ బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. ఆఫ్రిదీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బౌలర్‌గా తన సత్తా చాటాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ మిగతా బౌలర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. లీగ్ దశలో ఆ విధమైన స్ఫూర్తిని ప్రదర్శించడం వల్లనే మిగతా బౌలర్లు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నారని చెప్పవచ్చు. ఇదే ఆస్ట్రేలియాపై విజయానికి పాదులు వేసింది.
ఆఫ్రిదీ సహజసిద్ధమైన ఆటగాడిగా కనిపిస్తాడు. ఓడిపోతున్న దశలో మ్యాచును మలుపు తిప్పగల బ్యాటింగ్ సత్తాను అతను చాటగలడు. బంతిని బౌండరీలు దాటించడంలో అతను దిట్ట. శ్రీలంక ఆటగాడు దిల్షాన్‌తో, భారత బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌తో అతన్ని పోల్చవచ్చు. దక్కన్ చార్జర్ తరఫున హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ తరఫున ఆడినప్పుడు కూడా అతను ఆటలో ఆ కసినే చూపించాడు.












Click it and Unblock the Notifications