తెలంగాణపై నెగెటివ్: కెసిఆర్ కొత్త ప్లాన్

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ కార్యకర్తలపై పిడి యాక్ట్, నాసా కింద కేసులు బనాయించడమే అందుకు నిదర్శమని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో అణచివేత చర్యలు కేంద్రం ప్రారంభించిందని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌పై పిడి యాక్ట్ కింద కేసు పెట్టి వరంగల్ జైలుకు పంపించడం దానికి సూచన అని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
పిడి యాక్ట్, నాసా కింద కేసులు పెట్టడానికి పోలీసులు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల జాబితాను రూపొందిస్తున్నట్లు కూడా కెసిఆర్ చెప్పినట్లు సమాచారం. ఈ వాతావరణంలో వ్యూహాలను మార్చాల్సిన అవసరం ఉందని కెసిఆర్ చెప్పారని అంటున్నారు. ఇటీవల చిదంబరం హైదరాబాదు వచ్చినప్పటికీ తెలంగాణపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొని వెళ్లిపోయారు. చిదంబరాన్ని కలవడానికి మీడియా ప్రతినిధులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ స్థితిలో ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి తీసుకుని వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తప్ప మరి దేనికి కూడా అంగీకరించవద్దని ఆయన చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications