హరికృష్ణ దూరం: బాబు తెలంగాణ వైఖరిపైనే?

తెలంగాణపై చంద్రబాబు తీసుకునే నిర్ణయం తెలిసే హరికృష్ణ సమావేశానికి డుమ్మా కొట్టినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు తెలంగాణ అనుకూల వైఖరిని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. గతంలో హరికృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా బహిరంగంగా మాట్లాడారు. తమ తండ్రి తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాటం చేశారని, తెలుగుజాతి ఐక్యత కోసం ప్రయత్నాలు చేశారని హరికృష్ణ నమ్ముతున్నారు.
తన తండ్రి ఎన్టీ రామారావు ఆశయాలకు భిన్నంగా తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారనేది హరికృష్ణ అసంతృప్తికి కారణమని చెబుతున్నారు. తన వ్యతిరేకతకు పెద్దగా గుర్తింపు ఉండే అవకాశాలు కూడా లేకపోవడంతో ఆయన పోలిట్‌బ్యూరో సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు. మరోవైపు, ఆయన సోదరుడు బాలకృష్ణ చంద్రబాబుకు పూర్తి మద్దతుగా నిలిచారు.
తెలంగాణపై ఆ మధ్య చేసిన ప్రకటనను కూడా హరికృష్ణ వ్యతిరేకించారు. బాలకృష్ణ మాత్రం మద్దతు తెలిపారు. చంద్రబాబు కూడా హరికృష్ణను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. హరికృష్ణ పార్టీలో క్రియాశీలకంగా లేకున్నా ఫరవా లేదనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాజకీయంగా క్రియాశీలకంగా మారారు.
తాము తెలంగాణకు అనుకూలంగా 2008లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డామని చంద్రబాబు చెప్పారు. ఇదే విషయాన్ని అఖిల పక్ష భేటీలో తెలుగుదేశం నాయకులు చెప్పారు.












Click it and Unblock the Notifications