ఢిల్లీనీ వణికించాడు!: జైల్లో జగన్ బర్త్ డే వేడుకలు

YS Jagan
ఈ రోజు ( 21 శుక్రవారం, డిసెంబర్) వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. జగన్ తన నలభయ్యవ పుట్టిన రోజుల వేడుకలను ఈ రోజు జైలులోనే జరుపుకోనున్నారు. ములాకత్ సమయంలో కుటుంబ సభ్యులు, ఇతరులు జగన్‌ను కలువనున్నారు. జగన్‌కు వారానికి రెండు ములాకత్‌లు ఉంటాయి. నెలకు రెండు ప్రత్యేక ములాకత్‌లు కుటుంబ సభ్యులను కలిసేందుకు అవకాశముంటుంది.

ఈ ప్రత్యేక ములాకత్‌లో జగన్ కుటుంబ సభ్యులు ఆయనను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. సాధారణంగా నలుగురిని మాత్రమే ములాకత్ సమయంలో అనుమతిస్తారని తెలుస్తోంది. అయితే మరోవైపు అధికారులు మాత్రం ఇంతమందిని ములాకత్‌కు అనుమతించాలనే ప్రత్యేక నియమం ఏమీ లేదని చెబుతున్నారు. అయితే కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ఆయన మృతి తర్వాత తనను, తన కుటుంబ సభ్యులను కాంగ్రెసు పార్టీ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరిట కొత్త కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత అతనిపై అక్రమాస్తుల కేసు నమోదయి, సిబిఐ దానిని విచారిస్తోంది. ఈ కేసులో జగన్ మే 27వ తేదిన అరెస్టయ్యారు.

గత సంవత్సరం జగన్, ఆయన తల్లి కాంగ్రెసు పార్టీకి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి తమ పార్టీ తరఫున పోటీ చేసి అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. జగన్ ఐదు లక్షలకు పైగా మెజార్టీతో గెలిచి రికార్డ్ సృష్టించాడు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యేలు ఆయన వైపుకు వచ్చారు. వివిధ కారణాలతో వారు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. మూడుసార్లు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ హవానే కొనసాగింది.

వైయస్ జగన్ హవా కొనసాగుతుండటంతో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండి పలువురు ఎమ్మెల్యేలు ఆయన వైపుకు చూస్తున్నారు. ఉప ఎన్నికల అనంతరం టిడిపి ఎమ్మెల్యేలు కొడాలి నాని, ప్రవీణ్ కుమార్ రెడ్డి, తానేటి వనిత, అమర్నాథ్ రెడ్డి, కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగా రావు తదితరులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. కొందరు ఇప్పటికే అధికారికంగా జాయిన్ అయ్యారు. మరికొందరు కూడా జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.

వైయస్ జగన్ ఇటీవల తెలంగాణ ప్రాంతం పైనా దృష్టి సారించారు. ఆయన తెలంగాణ ఎంట్రీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోయారు. సీమాంధ్రలో టిడిపి, కాంగ్రెసులకు ముచ్చెమటలు పోయించిన జగన్ తెలంగాణలో కెసిఆర్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాడు. తెలంగాణలోను పలువురు ముఖ్య నేతలు జగన్‌కు జై కొడుతున్నారు... కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

టిడిపి, కాంగ్రెసు, టిఆర్ఎస్‌లను గుక్క తిప్పుకోకుండా చేస్తున్న జగన్ కేవలం రాష్ట్రంలో మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదిరించి బయటకు రావడం, నేరుగా ఆమె పైన విమర్శలు చేయడం, తన తండ్రి మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం... ఇలా ఆయన దేశవ్యాప్తంగా మీడియాలో నానారు. ఢిల్లీ కాంగ్రెసును గడగడలాడించారు. తన గురించి ఢిల్లీ కోర్ కమిటీ చర్చించే స్థాయిలో వారికి షాక్ ఇచ్చారు.

రాహుల్ గాంధీ కమిటీ రాష్ట్రంలో ప్రధానంగా జగన్ హవా గురించే ఆరా తీస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. జగన్ పైన సిబిఐ దర్యాఫ్తు కూడా రాష్ట్రంలో కాంగ్రెసును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కనుమరుగు చేయకుండా కాపాడుకునేందుకే అనే విమర్శలు ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. టిడిపి, కాంగ్రెసులు కలిసిపోయి తమను టార్గెట్ చేస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు ఆరోపిస్తోంది. అయితే ఇటీవల కాంగ్రెసుతో జగన్ పార్టీ లాబియింగ్ చేస్తుందనే విమర్శలను టిడిపి జోరుగా వినిపిస్తోంది.

ఏది ఏమైనా ఎన్నాళ్ల నుండో పాతుకుపోయిన పార్టీలను రాష్ట్రంలో వణికించడమే కాకుండా ఢిల్లీ పెద్దలను ఎదిరించి మీడియాలో జగన్ నానడం గమనార్హం. జగన్‌ను జైలులో కొద్ది రోజుల క్రితం జాతీయ స్థాయి నేతలు ఇద్దరు ముగ్గురు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. జగన్ హవా గమనిస్తున్న రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఇప్పటికీ తరుచూ జైలుకు వెళ్లి జగన్‌ను కలిసి వస్తూనే ఉన్నారు. అందుకే కాంగ్రెసు, టిడిపిలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం జైలులో ఉన్నట్లుగా ఉందని విమర్శిస్తున్నారు.

కాగా జగన్ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో గురువారం అర్ధరాత్రి(తెల్లవారితే శుక్రవారం) కేక్ కట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+