పరిటాల హత్య కేసు: జగన్‌కు గండం?

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఏ విధమైన అవకాశాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. ఈ స్థితిలో భాను కిరణ్, మంగలి కృష్ణ ఉదంతాలు, పరిటాల రవి హత్య కేసు వంటివి వైయస్ జగన్‌ను ఇరకాటంలో పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. పరిటాల రవి హత్య కేసును తిరగదోడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీకి తాజాగా అరెస్టయిన జగన్‌ అనుచరుడు మంగలి కృష్ణ, ఆయనతో సంబంధాలున్న భానుకిరణ్‌ వ్యవహారం తెరపైకి రావడంతో జగన్‌కు పరిటాల రవి హత్య కేసును అంటగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు వార్తలు వస్తున్నాయి.

పరిటాల రవి హత్యతో సంబంధాలున్నాయని చెబుతున్న మంగలి కృష్ణ, భాను కిరణ్‌లతో వైయస్ జగన్‌కు ఉన్న సంబంధాలపై ఇప్పటికే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణల జడివాన కురిపిస్తున్నారు. కనీసం నైతికంగానైనా జగన్‌ను ఆ విమర్శల ద్వారా దెబ్బ తీయాలనేది ఆ పార్టీల అభిప్రాయంగా కనిపిస్తోంది. తన భర్త పరిటాల రవి హత్య కేసును తిరిగి సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. అప్పట్లో వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నందున తన పలుకుబడి వినియోగించి, కేసును నీరుగార్చినందుకే ఆ కేసులో ముద్దాయిగా ఉన్న జగన్‌ తప్పించుకున్నారని ఫిర్యాదు చేస్తారని అంటున్నారు.

తద్వారా జగన్‌ నేర చరిత్రను ప్రజల్లో చర్చనీయాంశం చేయాలన్నది తెలుగుదేశం ప్రధాన లక్ష్యమని అంటున్నారు. గతంలో బెస్ట్‌ బేకరీ వంటి కేసులను తిరగతోడిన ఉదంతాలున్నాయని సునీత గుర్తు చేయనున్నారు. అంతే కాకుండా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి శాసనసభలో మంగలి కృష్ణకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలను కరపత్రాల రూపంలో ముద్రించి ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో విస్తృతంగా పంపిణీ చేసేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది.

‘ఎంక్వైరీ చేస్తున్న చాలామంది జూనియర్‌ పోలీసు ఆఫీసర్స్‌ మటుకు మంగళి కృష్ణ ఏ పాపం తెలియని వాడు. కారణం లేకుండా పులివెందుల శివారెడ్డి స్నేహితుడయినంత మాత్రాన కృష్ణను ఇన్‌వాల్వ్‌ చేసి, అతని ద్వారా జగన్మోహన్‌రెడ్డి ఇన్వాల్వు అయినట్లు చెప్పించడం చాలా తప్పు. ముక్కుపచ్చలారని పిల్లవాడు. 26,27 సంవత్సరాల వయసున్న పిల్లవాడు. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో తెలియనివాడు. వాడు వ్యాపారంలో ఎంతో కొంత పైకి వద్దామని ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు ఒక ముద్దాయిగా, ఫ్యాక్షనిస్టుగా చిన్న వయసున్న అతనిని చిత్రీకరించే ప్రయత్నం చేయటం చాలా తప్పని మనవి చేస్తున్నా’నని వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన కుమారుడు జగన్‌, ఆయన స్నేహితుడు మంగళి కృష్ణకు మద్దతుగా 2001 మార్చి 19వ తేదీన చేసిన వ్యాఖ్యలను కరపత్రాల రూపంలో పంపిణీ చేసేందుకు తెలుగుదేశం నాయకత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది.

హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన జీఎన్‌ఎం మస్తాన్‌ రావు అనే రియల్‌ఎస్టేట్‌ వ్యక్తి రాసిన మరణ వాంగ్మూలాన్ని కూడా చర్చనీయాంశం చేయనుంది. తనను మంగలి కృష్ణ చంపుతానని బెదిరిస్తున్నాడని, మాదాపూర్‌ ఎస్‌ఐ, సీఐ కూడా వారినే ప్రోత్సహిస్తున్నందున విధిలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుతోనయినా ఈ ప్రభుత్వం రౌడీలపై చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నానని తన మరణవాంగ్మూలంలో అతను రాశాడు. తన పిల్లలకు న్యాయం చేయాలని ఆత్మహత్య చేసుకునేముందు రాసిన లేఖలో దయనీయంగా అభ్యర్ధించాడు. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మీడియాకు బయటపెట్టింది. దాన్ని కూడా కరపత్రం రూపంలో ప్రచురించి పంచి పెట్టేందుకు సిద్ధమవుతోంది.

కాంగ్రెసు కూడా వైయస్ జగన్‌పై ఇదే తరహా యుద్ధానికి సిద్ధపడింది. పరిటాల హత్య కేసును మళ్లీ విచారించాలని, జగన్‌- మంగలికృష్ణ,భానుకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. సూరి హత్య కేసులో జగన్‌ బంధువుల హస్తం ఉందని కాంగ్రెసు శానససభ్యుడు వీరశివా రెడ్డి ఆరోపించారు. అప్పుడు దర్యాప్తు చేసిన సీబీఐ, వైఎస్‌ ఉన్న అధికార నివాసంలోకి వెళ్లి విచారించిందని, కానీ వాస్తవాలేవీ వెలుగులోకి రానందున, మరోసారి విచారిస్తే జగన్‌ లింకులు బయటపడతాయని వ్యాఖ్యానించారు.

సీనియర్‌ ఎంపీ వి.హన్మంతరావు సైతం జగన్‌ నేరచరిత్రపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ తెరవెనుక ఉండి నేరగాళ్లను ప్రోత్సహిస్తూ ఎంతకయినా బరితెగిస్తున్నారని రుజవయినందున వాటిపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. పరిటాల హత్యకేసును తిరిగి విచారించాలన్న డిమాండ్‌ సమంజసమేనని స్పష్టం చేశారు. ఇలా తాజా పరిణామాలను వైయస్ జగన్‌ను దెబ్బ తీయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు సమర్థంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+