ఊహించని మలుపు: షర్మిల దూకుడు

తల్లి వైయస్ విజయమ్మతో కలిసి షర్మిల కోస్తా జిల్లాల్లో రెండో రోజు ఉప ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. ప్రసంగంలో వైయస్ విజయమ్మ తడుముకుంటున్నారు. అయితే, షర్మిల మాత్రం ఏకధాటిగా ప్రసంగాన్ని కొనసాగించే నేర్పును అలవరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు తన సందేశాన్ని సూటిగా తీసుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి మనసు గల జగనన్నను గెలిపించాలని ఆమె కోరుతున్నారు.
తాను వైయస్ రాజశేఖర రెడ్డిని కూతురును, జగనన్న చెల్లెను అని తనను తాను పరిచయం చేసుకుని, తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. "మీ నుంచి ప్రజలను దూరం చేయడానికి కుట్ర చేశారు. రెండేళ్ల పాటు జగనన్న మీ మధ్యనే ఉన్నాడు. ఆయన ఎటువంటి వారో మీకు తెలుసు" అని అన్నప్పుడు ప్రజల నుంచి చప్పట్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు నీచ స్థాయికి దిగజారాయని అంటున్నారు.
"నీతి లేని రాజకీయాలు మనకు వద్దు. మంచి మనసు గల నాయకుడు కావాలి" అని అంటున్నారు. "రాష్ట్రాన్ని కాపాడడానికి జగనన్న ముఖ్యమంత్రి కావాలి, ఈ ఎన్నికల్లో మీరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేశారంటే అందుకు మీరు అంగీకరించినట్లే, జగనన్న ఏ తప్పూ చేయలేదని చెప్పినట్లే" అని షర్మిల అంటున్నారు. జగన్ పార్టీకి ఓటేస్తే వైయస్ ఇంకా మీ గుండెల్లో ఉన్నట్లేనని ఆమె చెబుతున్నారు. ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారని, దేవుడు మంచివారి వైపు ఉంటారని, తన సోదరుడు నిర్దోషిగా బయటకు వస్తారని, ముఖ్యమంత్రి అవుతారని ఆమె చెబుతున్నారు.
ఇలా షర్మిల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ప్రతి మాటకూ ప్రజల నుంచి స్పందన వస్తోంది. మొదటి రోజు కన్నా రెండో రోజు ఆమె శారీరక కదలికలు కూడా మారాయి. ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికల ప్రచారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షర్మిల తురుపు ముక్కేనని చెప్పాలి.












Click it and Unblock the Notifications