తెలంగాణ, సిఎం మార్పు: 10రోజుల్లో తేల్చేస్తారా?

ఢిల్లీ, హైదరాబాదుల్లో జరుగుతున్న బిజీ బిజీ సమావేశాలు చూస్తుంటే తెలంగాణపై ఏదో జరుగుతుందని అంటున్నారు. ఢిల్లీలో గవర్నర్ నరసింహన్... ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌లతో భేటీ అయ్యారు. శుక్రవారం కేంద్రమంత్రులు షిండే, చిదంబరం, ఆంటోనీలను గవర్నర్ కలుసుకుంటారని తెలుస్తోంది. సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో కెసిఆర్ సమావేశమయ్యారు. గురువారమే హైదరాబాద్‌లో... తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణ మంత్రులు సీమాంధ్రకు చెందిన జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకట రెడ్డిలతో కలిసి చర్చించారు. సీనియర్ నేత జానా రెడ్డితో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మంతనాలు జరిపారు. తెలంగాణ ఇవ్వలేమంటూ స్పష్టం చేయాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఎంపీ లగడపాటి రాజగోపాల్ లేఖ రాశారు. సీమాంధ్రకు చెందిన గాదె వెంకట రెడ్డి, మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, శైలజానాథ్ సమావేశమయ్యారు.
ఎఫ్‌డిఐలపై ఆందోళన కోసమంటూ ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాత్రికి అక్కడే మకాం వేశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం గురువారం రాత్రే ఆయన తిరిగి హైదరాబాద్ రావాల్సింది. కానీ... రాత్రి అక్కడే బస చేశారు. ఢిల్లీ పరిణామాలను మరింత లోతుగా దగ్గరుండి తెలుసుకునేందుకే ఆయన ఢిల్లీలో మకాం వేసినట్లుగా భావిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సమావేశమవుతున్నారు. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరునాడే ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీకి వెళ్తున్నారు. సిఎం రేసులో ఉన్న ఓ సీనియర్ నేతతో పలువురు ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరుపుతున్నారట.
ఇలా గందరగోళంగా ఉన్న రాష్ట్ర పరిస్థితులపై 10 నుంచి 15 రోజుల్లోపు ఢిల్లీ నుంచి కీలక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ఎన్నేళ్లుగానో అపరిష్కృతంగా ఉన్న తెలంగాణ సమస్యను, కాంగ్రెస్‌లో కొన్నాళ్లుగా కలవరం రేపుతున్న నాయకత్వ సమస్యను పరిష్కరించే దిశగా అది ఉంటుందని చెబుతున్నారు. ఆ నిర్ణయం ఎలా ఉండబోతోందనే లోతుపాతులపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. చాలారోజులుగా ఢిల్లీలోనే ఉన్న టిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాత్రం ఎలాంటి షరతులు లేని, గందరగోళాలకు తావివ్వని విధంగా... తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన సానుకూల ప్రకటన వెలువడుతుందని తన సన్నిహితులతో చెబుతున్నారట.
మరోవైపు సీమాంధ్ర నేతల్లో మాత్రం ఏదో తెలియని ఆందోళనతో కూడిన హడావుడి నెలకొంది. ఇందులో భాగంగానే... గురువారం సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. శుక్రవారం కూడా సమావేశమవుతున్నారు. తమ వాణిని కూడా బలంగా వినిపించాలని ఇప్పటికే సహచర నేతలను మంత్రి శైలజానాథ్ కదిలించారు. సమైక్యాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం కన్వీనర్ కూడా అయిన ఆయన ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశ సన్నాహాలపై గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో ఏరాసు ప్రతాప రెడ్డి, గాదె వెంకట రెడ్డి తదితరులతో శైలజానాథ్ మంతనాలు జరిపారు.












Click it and Unblock the Notifications