వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: బాబు చేతిలో కాంగ్రెసు కార్నర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలంగాణ సమస్య నుంచి తాను బయటపడడమే కాకుండా కాంగ్రెసును కార్నర్ చేయడానికి తగిన వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రూపొందిస్తున్నట్లు సమాచారం. తెలంగాణపై కాంగ్రెసు పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తమపై బాణాలు ఎక్కుపెట్టిన స్థితిలో దాని నుంచి బయటపడి కాంగ్రెసు కోర్టులోకి పూర్తిగా బంతిని విసిరేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఉప్పందినట్లు చెబుతున్నారు. దీనిపై కాంగ్రెసు అధిష్టానంలో తీవ్రంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, కేంద్రానికి మరో లేఖ రాయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడమే కాకుండా కాంగ్రెసు, తెరాసలు ఇరకాటంలో పడుతాయి.

తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం ప్రకటించడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నట్లు ఆయన మాటలను బట్టి కూడా అర్థమవుతోంది. ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని ఆయన కచ్చితంగానే మాట్లాడారు. దీనిపై చర్చలు జరుపుతున్నామని, తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు బాధ్యత విస్మరించి తన వైపు వేలెత్తి చూపుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యతను తాను నెరవేరుస్తానని ఆయన అన్నారు. ఈ రకంగా చూస్తే ఆయన తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు కచ్చితమైన నిర్ణయం తీసుకుంటే కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంతంలో బతికి బట్ట కట్టడం కష్టమని అంటున్నారు. తెరాస శ్రేణులు చాలా వరకు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. మరో వైపు, సిపిఐ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి కార్యక్షేత్రంలోకి దూకేందుకు సిద్ధపడుతోంది.

తెలంగాణపై తేల్చాల్సిన అనివార్య స్థితిలో కాంగ్రెసు అధిష్టానం పడినట్లేనని చెప్పాలి. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోవడానికైనా తెలంగాణ సమస్యను పరిష్కరించక తప్పని అనివార్యతలో కాంగ్రెసు పడినట్లు చెబుతున్నారు. వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికలకు ముందే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉప ఎన్నికలు జరిగే 18 స్థానాల్లో ఏ ఒక్క సీటు గెలిచినా అది తెలుగుదేశం పార్టీకి బోనసే. అన్నీ ఓడిపోయినా ఆ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే అవన్నీ కాంగ్రెసు సిట్టింగ్ స్థానాలు. అందువల్ల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని దాన్ని ఈ 18 స్థానాల ఉప ఎన్నికల్లో పరీక్షకు పెట్టే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, చంద్రబాబు కాంగ్రెసును ఇరకాటంలో పెట్టడానికి పెద్ద ఎత్తుగడతోనే ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that TDP president N Chandrababu has decided to corner Congress on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X