IPL 2026: కొంపముంచిన జడేజా.. బుడ్డోడి శతకం వృథా!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలుపొందింది. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సెంచరీ వృథా అయ్యింది.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. రవీంద్ర జడేజా ఘోర తప్పిదంతో పాటు లోయారర్డర్ బ్యాటింగ్ వైఫల్యం రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
చెలరేగిన ఇషాన్..
229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్(31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), అభిషేక్ శర్మ(29 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 57) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. నితీష్ కుమార్ రెడ్డి(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), హెన్రీచ్ క్లాసెన్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 29) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. డొనోవన్ ఫెర్రీరా ఒక వికెట్ తీసాడు.

అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్స్‌లతో 103)సెంచరీతో చెలరేగగా.. ధ్రువ్ జురెల్(35 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/38) రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హింగేలు తలో వికెట్ తీసారు.
కొంపముంచిన జడేజా..
229 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ ఔటవ్వగా.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ జట్టును ఆదుకున్నారు. అయితే 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తుషార్ పాండే బౌలింగ్‌లో అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రవీంద్ర జడేజా వదిలేసాడు. ఈ అవకాశంతో అభిషేక్ శర్మ చెలరేగాడు. ఇషాన్‌తో కలిసి దూకుడుగా ఆడి పవర్ ప్లేలో భారీ స్కోర్ అందించడంతో పాటు రెండో వికెట్‌కు 132 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ భాగస్వామ్యంతో సన్‌రైజర్స్ లక్స్య ఛేదన ఈజీ అయ్యింది.
తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ తమదైన శైలిలో చెలరేగి జట్టును వియం ముంగిట నిలబెట్టారు. అయితే 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో నితీష్ రెడ్డి ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ మ్యాన్‌లో బ్రిజేష్ వదిలేసాడు. ఈ క్యాచ్ డ్రాప్ కూడా రాజస్థాన్ రాయల్స్‌కు నష్టం చేసింది.ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొచ్చింది.
అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్ లోయరార్డర్ బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోయారు. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ ధాటికి ఓ దశలో రాజస్థాన్ రాయల్స్ 250+ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని రాజస్థాన్‌ను 230లోపు కట్టడి చేశారు.












Click it and Unblock the Notifications