కొండా సురేఖకు సీఎం బిగ్ షాక్.. పరకాల టికెట్ ఆయనకే!
వరంగల్ నేలకు ఒక గొప్ప చరిత్ర, పోరాట చైతన్యం ఉందని, పాలకుల అణచివేతకు గురైన ప్రతి సందర్భంలోనూ ఇక్కడి ప్రజలు తమ తిరుగుబాటును చాటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పరకాలలో నిర్వహించిన "ప్రజా పాలన ప్రగతి బాట" బహిరంగ సభలో ఆయన కేసీఆర్ కుటుంబ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకుర్తిలో తమ పార్టీ నాయకురాలు యశస్విని రాజకీయ కొండను బద్దలు కొట్టి విజయం సాధించారని గుర్తుచేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం కూలేశ్వరమైనా సరే.. ప్రాజెక్టులను నీటితో నింపి రైతులు అత్యధికంగా పంటలు పండించేలా చర్యలు తీసుకున్నామని సీఎం వివరించారు.
రైతాంగం, మహిళల సంక్షేమానికి రూ. లక్ష కోట్ల ప్రాధాన్యం!
తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గత 32 నెలల కాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఏకంగా రూ.90 వేల కోట్లు చెల్లించామని, రైతు భరోసా, రుణమాఫీ అమలు చేస్తూ రైతును రాజుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెండున్నరేళ్ల పాలనలో రైతుల శ్రేయస్సు కోసమే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని, సన్న ధాన్యానికి బోనస్ అందించిన ఘనత తమదేనన్నారు. ఇక మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ ఇద్దరు ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చామని తెరిపారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలకు గుండు సున్నా పెడితే, తమ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిందని, యూనిఫాం కుట్టే పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించడంతో పాటు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణలో ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

కుటుంబ స్వార్థం కేసీఆర్‌ది.. ప్రజా సంక్షేమం మాది!
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టారని, కానీ ప్రజా ప్రభుత్వంలో సామాన్యులకు, పోరాట యోధులకు గుర్తింపు దక్కిందని సీఎం లెక్కలతో సహా వివరించారు. కేసీఆర్ తన కొడుకు, అల్లుడిని మంత్రులను చేస్తే, తాను సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌లను మంత్రులను చేశానని చెప్పారు. కేసీఆర్ బిడ్డకు, చుట్టాలకు పదవులు ఇచ్చుకుంటే.. తాను కావ్యను ఎంపీగా, యశస్వినిని ఎమ్మెల్యేగా, మిత్రధర్మంగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ, ఉద్యమకారుడు కోదండరాంకు ఎమ్మెల్సీ, మహేష్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చానని గుర్తుచేశారు. రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటకు గెంటేసిన చరిత్ర కేటీఆర్‌దని, కొడుకు తప్పులను కప్పిపుచ్చేందుకు కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మారారని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగులకు తీపి కబురు.. సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు!
పదేళ్లపాటు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, తమ ప్రజా ప్రభుత్వంలో ఇప్పటివరకు 72 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, నిరుద్యోగుల భవిష్యత్తు కోసమే వయోపరిమితిని సడలించామని వెల్లడించారు. ప్రతి ఆరునెలలకొకసారి ఖాళీలను గుర్తించి భర్తీ చేసే బాధ్యత తమదని, అభ్యర్థులు రాజకీయ మాయమాటలకు మోసపోకుండా పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కొండా సురేఖకు షాక్.. సీఎం టూర్ కు దూరంగా..
మరోవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుష్మితను బరిలోకి దించాలన్న యోచిస్తున్న మంత్రి కొండా సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాకిచ్చారనే చెప్పాలి. సెప్టెంబరులో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం.. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం వెయ్యిమంది కేసీఆర్‌లు వచ్చినా తమ వెంట్రుక కూడా పీకలేరని, 2029లో రెట్టింపు మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు. అందులో భాగంగా రానున్న ఎన్నిక్లలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డే మరోసారి పోటీ చేస్తారని బహిరంగ ప్రకటన చేశారు. దీంతో కొండా ఫ్యామిలీ ఆశలకు గండిపడ్డట్లయింది. ఇవాళ సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు కొండా సురేఖ-మురళి దంపతులు దూరంగా ఉన్నారు.














Click it and Unblock the Notifications