ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు రాజమహేంద్రవరం రెడీ!
దేశవ్యాప్తంగా పర్యాటక దినోత్సవ వేడుకలకు అన్ని రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా పర్యాటక దినోత్సవ వేడుకలు బాగా జరపటానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను పర్యాటక, సాంస్కృతిక కేంద్రమైన రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఈరోజు వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్ లో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, టూరిజం ఎండీ పట్టాన్ శెట్టి రవి సుభాష్ లతో మంత్రి దుర్గేష్ కీలక సమావేశం నిర్వహించారు. . ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరంలో పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయాలన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరఫున చేపట్టాల్సిన ఏర్పాట్లు, టెంట్ సిటీలు, హోమ్ స్టేలు తదితర భక్తులకు మెరుగైన వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రానికి ఇన్-బౌండ్ టూరిస్టుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు, విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. ఏడాదంతా నిరంతరం పర్యాటక శోభ ఉట్టిపడేలా వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు జరపాలని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా మంజూరైన నిధులు, వాటితో జరుగుతున్న పనుల ప్రగతిని మంత్రి దుర్గేష్ సమీక్షించారు. త్వరలోనే మరిన్ని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రానికి సమర్పించి, అదనపు నిధులు రాబట్టేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
