సుప్రీం బెంచ్ లో చీలిక- కీలక పరిణామాలు..! ఈసీ వివాదాల వేళ మరో బిగ్ ట్విస్ట్..!
మన దేశంలో ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘంలో ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియలో మార్పులు చేస్తూ కేంద్రం 2023లో తీసుకొచ్చిన చట్టం విషయంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలా వద్దా అనే అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెంచ్.. తుది నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం రెండుగా చీలిపోయింది. చివరికి ఇప్పటికే ఆలస్యమైన ఈ కేసు విచారణలో మరింత జాప్యాన్ని నివారించేందుకు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి పంపారు.
ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం తెచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయడంపై సుప్రీంకోర్టులో (Supreme Court) ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వాదనతో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఏకీభవించగా, జస్టిస్ దీపాంకర్ దత్తా మాత్రం అసమ్మతి వ్యక్తం చేశారు. ఈ కేసును విస్తృత బెంచ్‌కు పంపాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఈ సుదీర్ఘ ప్రక్రియలో మరింత ఆలస్యాన్ని నివారించడానికి, తుది నిర్ణయాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనానికి వదిలివేయాలని ఇద్దరు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇవాళ సుప్రీంకోర్టు విచారణ సందర్బంగా న్యాయమూర్తుల్లో ఒకటైన జస్టిస్ దీపాంకర్ దత్తా కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలోని ఎన్నికల నియామక కమిటీ కూర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, ఆయన నామినేట్ చేసిన కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడితో కూడిన ప్రస్తుత కమిటీలో పారదర్శకత లోపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నామినేట్ చేసిన మంత్రి, ప్రధానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉండదన్నారు. ఎన్నికల సంఘం కేవలం స్వతంత్రంగా పనిచేస్తే సరిపోదని, అది స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు ప్రజలకు కనిపించాలని, అప్పుడే విశ్వసనీయత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ దత్తా క్రికెట్లో బ్యాటింగ్ చేసే జట్టు కెప్టెన్ తనకు నచ్చిన అంపైర్‌ను ఎంపిక చేసుకుంటే, ఆ అంపైర్ మ్యాచ్‌లో ఎంత నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రత్యర్థి జట్టుకు, ప్రేక్షకులకు అతనిపై ఎల్లప్పుడూ ఏదో ఒక మూల సందేహం ఉంటుందని గుర్తుచేశారు. అలాగే ఈసీ నియామక ప్రక్రియ అధికార పక్షం చేతుల్లోనే ఉంటే ప్రజల్లో అటువంటి అభిప్రాయమే ఏర్పడుతుందన్నారు. ఈ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతో పాటు ప్రధాని నామినేట్ చేసే వ్యక్తి కాకుండా ఛీఫ్ జస్టిస్ ఉండాలని పిటిషనర్లు వాదిస్తున్నారు.














Click it and Unblock the Notifications
