47 ఏళ్లుగా నలుగుతున్న కేసు.. సుప్రీంకోర్టులో సుఖాంతం! "తీర్పుల కంటే సంధి మేలు"
ఈ వివాదం మూలాలు 1952 నాటివి. అప్పట్లో ఒక దుకాణాన్ని అద్దెకు ఇవ్వగా, ఆ తర్వాత యజమాని ఖాళీ చేయించాలని భావించి 1979లో అధికారికంగా కోర్టును ఆశ్రయించారు. వివిధ కోర్టులలో ఏళ్ల తరబడి విచారణలు సాగి, 2017 నాటికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మధ్యలో 2003లోనే ఆ షాపును అద్దెదారుడికే విక్రయించేందుకు యజమాని ఒప్పందం కుదుర్చుకుని, కొంత సొమ్ము కూడా తీసుకున్నారు. అయితే వివాదం మాత్రం సమసిపోకుండా రెండు దశాబ్దాలకు పైగా న్యాయస్థానాల్లో నానుతూనే వచ్చింది.
సయోధ్య కుదిర్చిన 'సమాధాన్ సమారోహ్'
ఈ చిక్కుముడిని విప్పేందుకు జైపూర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ సహకారంతో సుప్రీంకోర్టు 'సమాధాన్ సమారోహ్' ద్వారా మధ్యవర్తిత్వం వహించింది. ఒకరిపై ఒకరు గెలవడం కంటే ఇద్దరికీ న్యాయం జరగడమే ముఖ్యమని ఇరుపక్షాలకు వివరించారు. దీనికి స్పందించిన యజమాని, ఒప్పందం ప్రకారం నిర్ణీత మొత్తానికి ఆ షాపును అద్దెదారుడికే విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో 47 ఏళ్ల పాటు నడిచిన వివాదానికి తీర్పుల ద్వారా కాకుండా, పరస్పర అంగీకారంతో శుభకార్యంలా ముగింపు పడింది.

ప్రజల గుమ్మం వద్దకే న్యాయం
'సమాధాన్ సమారోహ్' అంటే దేశవ్యాప్తంగా కేసులను చర్చల ద్వారా పరిష్కరించే సుప్రీంకోర్టు ప్రత్యేక చొరవ. కోర్టు మెట్లు ఎక్కి ఏళ్ల తరబడి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా "సహిష్ణుతతో కూడిన న్యాయాన్ని" ప్రజల ముంగిటకే తీసుకెళ్లడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే ఇటీవల ఆగస్టు 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్, ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు, లేబర్, బ్యాంకింగ్, పన్నులు, ఉద్యోగాలకు సంబంధించిన కేసులను ఇక్కడ పరిష్కారానికి స్వీకరించారు.
రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం
మూడు రోజుల పాటు సాగిన ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 3,285 కేసులు విచారణకు రాగా, అందులో ఏకంగా 1,664 కేసులు ఇరుపక్షాల ఒప్పందంతో త్వరితగతిన పరిష్కారమయ్యాయి. మరొక 48 కేసులు ప్రత్యక్ష మధ్యవర్తిత్వం ద్వారా ముగిశాయి. మొత్తంగా 1,712 కేసులకు ఏకకాలంలో పరిష్కారం లభించింది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ నుంచి వేలాది కుటుంబాలకు ఈ 'సమాధాన్ సమారోహ్' పెద్ద ఊరటనిచ్చింది.














Click it and Unblock the Notifications