Super El Nino: నవంబర్, డిసెంబర్‌లో పరాకాష్టకు. ప్రకృతి ప్రకోపానికి సిద్ధంగా ఉండండి..
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థను అతలాకుతలం చేసే దిశగా ఒక మహా విపత్తు దూసుకొస్తోంది. ప్రశాంత మహాసముద్రంలో వేగంగా రూపుదిద్దుకుంటున్న 'ఎల్ నినో' ప్రభావం రాబోయే నవంబర్, డిసెంబర్ నాటికి పరాకాష్టకు చేరుకోనుందని వాతావరణ శాస్త్రవేత్తలు అత్యంత హెచ్చరికలతో కూడిన నివేదికను విడుదల చేశారు. మానవ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ తరమూ చూడనంత తీవ్రమైన రీతిలో ఈ 'సూపర్ ఎల్ నినో' విరుచుకుపడనుందని, దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగిపోతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
ఈక్వటోరియల్ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణ స్థాయి కంటే గణనీయంగా పెరిగి 'సూపర్ ఎల్ నినో' స్థాయికి చేరుకున్నాయి. అయితే అధికారులను, శాస్త్రవేత్తలను మరింత తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏంటంటే.. సముద్ర ఉపరితలం కింద అత్యంత ఉష్ణ తీవ్రతతో కూడిన నీటి నిల్వలు పెరిగిపోతుండటమే. ఈ వేడి రాబోయే కొన్ని నెలల్లో పైకి వ్యాపించి, వాతావరణంలో ఊహించని మార్పులకు కారణం కానుంది. ఈసారి వేడెక్కుతున్న వేగం, నీటి నిల్వల ఉష్ణోగ్రత గత రికార్డులన్నింటినీ తలకిందులు చేస్తోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

కరువులు, తుఫాన్లు, తీవ్రమైన వేడి గాలులు..
మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే భిన్నంగా వేడి నీరు విస్తరించడం వల్ల గాలి పీడనం, గాలి వీచే దిశలు పూర్తిగా మారిపోతాయి. దీని ప్రభావం వర్షపాతం, రుతుపవనాలు, వరదలు, ఎండ తీవ్రతపై పడుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ ఎల్ నినో తీవ్రత ఈ ఏడాది చివరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకొని, మునుపటి చారిత్రక రికార్డులను దాటి ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముందున్నది 18 నెలల గండం.. ప్లస్ 2 డిగ్రీలు!
మానవ తప్పిదాల వల్ల ఇప్పటికే పెరుగుతున్న భూతాపానికి ఈ భయంకరమైన ఎల్ నినో తోడైతే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వపు స్థాయిల కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాబోయే 12 నుంచి 18 నెలల కాలం అత్యంత కీలకమని, ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు తీవ్ర అనావృష్టి-కరువులు, మరోవైపు అకాల భారీ వర్షాలు, ఊహించని తుఫాన్లు విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్రాలు వేడెక్కుతున్న తీరును బట్టి చూస్తుంటే, భూగోళం ఒక పెద్ద పర్యావరణ పరీక్షను ఎదుర్కోబోతోందని స్పష్టమవుతోంది.














Click it and Unblock the Notifications