విజయమ్మ ఊ కొట్టారు, వారు ఉలిక్కిపడ్డారు

YS Vijayamma
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాకు ఆటంకాలు ఏర్పడకుండా భద్రతా ఏర్పాట్లు చేయడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడుతున్నారు. లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మాత్రం హర్షిస్తున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరింత పుంజుకుంటే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు భావిస్తుండగా, తెలంగాణవాదాన్ని దెబ్బ కొట్టడానికి విజయమ్మ ధర్నా పనికి వస్తుందని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు.

విజయమ్మ ధర్నాపై కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి తీరుపై పరోక్ష వ్యాఖ్యలు చేయగా, వి. హనుమంతరావు నేరుగానే ముఖ్యమంత్రి తీరును తప్పు పట్టారు. భారీ భద్రత కల్పించి విజయమ్మను సిరిసిల్లకు పంపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవర్టులున్నారని, వారిని ఏరివేయకుంటే ప్రమాదమని ఆయన అన్నారు. వీసా తీసుకుని తెలంగాణలోకి రావాల్సి ఉంటుందని విజయమ్మ భర్త వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, ఇప్పుడు ఎవరి వీసా తీసుకుని విజయమ్మ తెలంగాణకు వచ్చారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజయమ్మకు వీసా ఇచ్చారా అని ఆయన అడిగారు.

సీమాంధ్రలో సామాజిక న్యాయం జరగాలని తాము కడప జిల్లాకు వెళ్తే తమకు రక్షణ కల్పిస్తారా అని వి. హనుమంతరావు అడిగారు. విజయమ్మకు అంత భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగారు. తెలంగాణకు చెందిన ఇతర కాంగ్రెసు నాయకులు కూడా విజయమ్మ దీక్షకు ముఖ్యమంత్రి కల్పించిన భద్రతను తప్పు పడుతున్నారు.

ఇప్పటి వరకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు మధ్య పోటీ ఉంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోవడంతో తమకు ఎప్పటికైనా ఢోకా ఉండదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు భావిస్తూ వచ్చారు. అయితే, పరకాల ఉప ఎన్నిక తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుకు పెద్ద సవాల్‌ను విసురుతుందనే విషయాన్ని గమనించారు. తెరాసకు, వైయస్సార్ కాంగ్రెసుకు మధ్య పోటీ నెలకొనే పరిస్థితులు వస్తే, తమ ఉనికి గల్లంతవుతుందనే ఆందోళనతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఉన్నారు.

పైగా, తెలంగాణ ప్రాంతంలో మరింత బలం పుంజుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే సిరిసిల్లలో విజయమ్మ ధర్నా తలపెట్టారనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో వైయస్ విజయమ్మ ఇలా కార్యక్రమాలు నిర్వహించుకుంటు పోతే కాంగ్రెసు తెలంగాణలో కూడా తీవ్రంగా దెబ్బ తినే పరిస్థితులు వస్తాయి. తాము వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు అటుంచి, కనీసం పోటీ ఇచ్చే స్థితిలో కూడా ఉండబోమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మొదటి నుంచీ వైయస్ జగన్‌ను వ్యతిరేకిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు చేతిలో తాము దెబ్బ తినే ప్రమాదం ఏర్పడుతుందని వారు భావిస్తున్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి తీరును వారు తప్పు పడుతున్నారు. ఏమైనా, తెలంగాణలో కూడా కాంగ్రెసు ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు పొంచి ఉన్నాయనే అంచనాలు సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+