జగన్ ఎపిసోడ్, సోనియా ప్రత్యక్ష పర్యవేక్షణ

ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు, పెట్రోలు ధరను పెంచడం వంటి నిర్ణయాలు సాహసోపేతమయినప్పటికీ, దాని వెనుక భారీ రాజకీయ వ్యూహమే తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 28 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అందులో 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ మన రాష్ట్రంలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ జగన్‌ను సాధ్యమైనంత మేరకు అడ్డుకోవడమే కాకుండా ఉప ఎన్నికల తర్వాతి పరిస్థితిని తమ అదుపులోకి తీసుకోవడానికి జగన్‌ను కట్టడి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు కూడా వ్యూహాత్మకంగానే జరిగిందని అంటున్నారు. వైయస్ జగన్ అరెస్టు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై అహ్మద్ పటేల్ రాష్ట్ర నాయకులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేంద్రంలో కాంగ్రెసు అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పట్టు బిగించే ఉద్దేశంతోనే సోనియా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అవినీతిని అంతం చేయడానికి తమవారిపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడలేదనే సంకేతాలను కాంగ్రెసు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
మోపిదేవి వెంకటరమణ అరెస్టు తర్వాత మరో ఐదుగురు మంత్రులకు కూడా అదే గతి పడుతుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వానికి ఎవరైనా ఒకటేనని, తప్పు చేశారని తేలితే జగనయినా, మంత్రులయినా ఎవరైనా ఒకటేనన్న సంకేతాలు పంపించేందుకే ఈ సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు. జగన్‌ను అరెస్టు చేసే ముందు కొందరు కాంగ్రెస్ మంత్రుల కూడా అరెస్టు జరిగితే, అప్పుడు జగన్‌ను అరెస్టు చేసి నా ప్రజల్లో సానుభూతి రాదని, దానితోపాటు కాంగ్రెస్ వారిని కూడా అరెస్టు చేశారు కాబట్టి ఆయనపై కక్ష సాధింపునకు అవకాశం లేదన్న అభిప్రాయానికి వస్తారన్న వ్యూహం కూడా కనిపిస్తోంది.
జగన్‌కు సానుభూతి రాకుండా ఉండాలన్నా, ఆయనపై కాంగ్రెస్ కక్ష సాధి స్తుందన్న భావనకు తావులేకుండా ఉండేందుకే మంత్రులను అరెస్టు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పార్టీకి నష్టం జరిగినా ఫర్వాలేదు, జగన్‌కు మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ సానుభూతి దక్కకూడదన్నదే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో 2 జి స్పెక్ట్రం కేసులో యుపీఏ భాగస్వామ్య పక్షమైన డీఎంకెకు చెందిన మంత్రి రాజా, ఎంపీ, కరుణానిధి కుమార్తె కళిమొళితో పాటు, కాంగ్రెస్ ఎంపీ సురేష్ కల్మాడీని కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఆ సమయంలో సైతం కాంగ్రెస్ ఇదే వ్యూహం అనుసరించింది.
తమ సొంత పార్టీ ఎంపీతో పాటు, యుపీఏలో ఉన్న మంత్రిని కూడా అరెస్టు చేశామని, ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని కాంగ్రెస్ సమర్ధించుకుని, విపక్షాలపై ఎదురుదాడి చేసింది. ఇప్పుడు జగన్ అరెస్టు తర్వాత కూడా కాంగ్రెస్ ఇదే వ్యూహంతో వెళ్లి, జగన్ పార్టీపై ఎదురుదాడి చేసేందుకు సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications