చంద్రబాబుకు దారి చూపిన వైయస్ జగన్

తెలంగాణ అంశం సీమాంధ్రలో పనిచేసి ఉంటే జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు ఇంత పెద్ద యెత్తున గెలిచి ఉండేవారు కారని అంటున్నారు. వైయస్ జగన్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర విభజనను ఆమోదించినట్లేనని, దాంతో రాష్ట్రం రెండుగా చీలిపోతుందని కాంగ్రెసు నాయకులు విస్తృతంగా ఉప ఎన్నికల్లో ప్రచారం సాగించారు. తమ పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌తో పాటు సీమాంధ్రకు చెందిన కొంత మంది మంత్రులు ప్రచారం సాగించారు.
కాంగ్రెసు నాయకులు ఆ విషయాన్ని ఎంతగా ప్రచారం చేసినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు సీమాంధ్రలో విజయం సాధించడం వల్లనే చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి పురికొల్పినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తే సీమాంధ్రలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం లేదని చంద్రబాబు గ్రహించారని, అదే విషయాన్ని పార్టీ సీమాంధ్ర నాయకులకు వివరించారని అంటున్నారు.
తెలంగాణపై స్పష్టత ఇవ్వకపోతే ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్రకు కాకుండా పోయే వాతావరణం ఉందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. నమ్మకమైన కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలోని బిసీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ అంశం ముందుకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీపై అభిమానం ప్రకటిస్తూనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓట్లేస్తూ వస్తున్నారనే విషయం పార్టీ విశ్లేషణలో తేలినట్లు చెబుతున్నారు.
తెలంగాణకు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన చేసి, మరోసారి కేంద్రానికి లేఖ ఇస్తే నీరసపడిన పార్టీ శ్రేణులు, ఇతర పార్టీలకు వెళ్లిన శ్రేణులు తిరిగి వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. పైగా, తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత తెలంగాణపై డ్రామాలు చేస్తున్నాయని తెరాసపై, కాంగ్రెసును దుయ్యబడుతూ తెలంగాణలో దూసుకుపోవచ్చుననే అభిప్రాయం బలపడినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో సిపిఐ తెలంగాణ కోసం కార్యాచరణను చేపట్టింది. తెలంగాణ పోరు యాత్రకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ విషయంలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విశ్వసనీయతను కోల్పోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఇదే అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఉన్నట్లు సమాచారం. తాము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణ శక్తులు తమ వైపు తిరిగి రావడమే కాకుండా సిపిఐ మద్దతును రాష్ట్రవ్యాప్తంగా పొందవచ్చుననే అంచనా చంద్రబాబుకు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారణాలతో చంద్రబాబు సెప్టెంబర్ మొదటివారంలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications