జగన్‌తో వైయస్ వివేకా చేతులు కలుపుతారా?

వైయస్ వివేకానంద రెడ్డితో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పటికే పలు మార్లు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి, వైయస్ జగన్ ఒక్కటవుతారనే ప్రచారం కడప జిల్లాలో జోరందుకుంది. ఇందుకు అనుగుణంగానే వైయస్ వివేకానంద రెడ్డి వ్యవహార శైలి ఉందని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియాపై సిబిఐ, ప్రభుత్వ చర్యలపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి మూతపడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి వల్ల కాంగ్రెసుకు సమస్యలు ఎదురవుతాయని ఆయన అన్నారు.
కాగా, కడప జిల్లా ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వైయస్ వివేకానంద రెడ్డి దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి ప్రచార సభల్లో మాత్రం ఆయన మొక్కుబడిగా పాల్గొన్నారు. ఆ తర్వాత అటు వైపు కూడా చూడడం లేదు. కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. పులివెందుల శాసనసభా నియోజకవర్గంలో వైయస్ విజయమ్మపై ఓటమి పాలైన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సీటు కోసం ఆయన చేసిన తీవ్ర ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
కడప జిల్లా ఉప ఎన్నికల్లోని నియోజకవర్గాల అభ్యర్థుల ఖరారులో కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ వివేకానంద రెడ్డిని పట్టించుకోలేదని అంటున్నారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సమరం సాగించిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెసు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, అధిష్టానం సూచనతో తాత్కాలికంగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డిపై సమరానికి తెర దించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, వైయస్ వివేకానంద రెడ్డి అబ్బాయ్ వైపు చూస్తున్నట్లు మాత్రం కడప జిల్లాలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications