మారిన వ్యూహం: కిరణ్‌పై జగన్ పార్టీ అవిశ్వాసం?

శాసనసభలో 17 మంది సభ్యుల బలం ఉన్న వెైయస్సార్ కాంగ్రెసు తమతో కలసి వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యుల మద్దతు సంపాదించి రానున్న శాసనసభ సమావేశాలలో కిరణ్ ప్రభుత్వంపై తామే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే తెరాస నాయకత్వంతో ఈ విషయంపెై వైయస్సార్ కాంగ్రెసు నేతలు కొందరు చర్చించి నట్టు సమాచారం.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలని వైయస్సార్ కాంగ్రెసు పదే పదే డిమాండ్ చేస్తోంది. అవసరమైన సంఖ్యాబలం ఉన్నా తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గుతున్నారని చాలా రోజుల నుంచి ఆరోపిస్తూ వస్తోంది. కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు గౌరవ అధ్యక్షురాలు వెైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె, ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న షర్మిల అదే పనిగా ఆరోపిస్తూ వస్తున్నారు.
తెలుగుదేశం పార్టీపై ఆధార పడకుండా తామే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తే అప్పుడు ఆ పార్టీ నెైజం బయటపడుతుందని వైయస్సార్ కాంగ్రెసు అభిప్రాయపడుతోంది. ఒకవేళ తెలుగుదేశం తాము ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీ వెైఖరిని జనంలో ఎండగట్టవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందనే తమ ఆరోపణలకు బలం చేకూరుతుందని, దానివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందని అనుకుంటోంది.
తెరాస కూడా కలిసి వస్తే, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ఏడుగురు సభ్యులు ఉన్న మజ్లిస్ పార్టీ ఇప్పటికే ప్రకటించటంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు అవసరమైన సంఖ్యాబలం కన్నా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అవిశ్వాసం ప్రతిపాదించటానికి అవసరమైన సంఖ్యాబలం 30 కాగా తెరాస, మజ్లిస్ మద్దతుతో ఆ బలం సరిపోతుందని, తెలుగుదేశం పార్టీని సవాల్ చేయటం కన్న తామే ఆ తీర్మానాన్ని ప్రతిపాదించి ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పడవేసే ఆలోచనలో వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications