వైయస్సార్ క్రెడిట్ వైయస్ జగన్‌దే

వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం వైయస్ జగన్‌కు దక్కడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదని చిరంజీవి వంటి ప్రముఖ కాంగ్రెసు నాయకులు కూడా వాదిస్తూ వచ్చారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి చేసిన వాదనలేవీ కాంగ్రెసు పార్టీకి ప్రయోజనం చేకూర్చలేదని తేలిపోయింది. దీంతో వైయస్ రాజశేఖర రెడ్డి నామజపం నుంచి కాంగ్రెసు నాయకులు క్రమంగా వెనక్కి తగ్గుతూ వస్తున్నారు. కొత్త పథకాలతో ముఖ్యమంత్రి తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది ఉప ఎన్నికల ముందు నుంచే ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు దానికి మరింత ఊపునిచ్చే అవకాశాలున్నాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి చర్యలపై, ఫాక్షన్ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ దుమ్మెత్తి పోస్తూ వచ్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడు వైయస్ జగన్‌కు ప్రయోజనాలు చేకూర్చడానికి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వచ్చింది. దాని ఆధారంగానే సిబిఐ జగన్ ఆస్తులపై విచారణ జరుపుతోంది. ఇందుకు వైయస్ జగన్ జైలు పాలు కూడా అయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని జగన్ అవినీతిని తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో ప్రధాన ఎజెండా చేసింది. అయినా, ప్రజలకు అది పట్టలేదు.
వైయస్ జగన్ అవినీతి ప్రజలకు పట్టకుపోవడానికి కారణాలేమిటనేది ఓ వైపు చర్చ కాగా, వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజల్లో ఎందుకు ఆదరణ ఉంది, అది జగన్‌కు ఎందుకు ఉపయోగపడిందనే చర్చ మరో వైపు సాగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 సేవలు ప్రజల్లో ఆదరణకు కారణమయ్యాయి. ఆ పథకాలే జగన్‌కు ఉప ఎన్నికల్లో చాలా వరకు ఓట్లు తెచ్చిపెట్టాయి. ఉన్నత స్థాయిలోని అవినీతి కన్నా తమకు ఎవరి వల్ల ఏదో మేరకు ప్రయోజనం చేకూరిందనేదే ప్రజలు గుర్తించే విషయం.
రాజకీయాల్లో అవినీతికి పాల్పడని నాయకుడు ఉంటాడంటే నమ్మలేని స్థితికి సమాజం చేరుకుంది. అందరూ అవినీతికి పాల్పడేవారే, కానీ తమకు ఏదో మేరకు ప్రయోజనం చేసిన నాయకుడు ఎవరనేది మాత్రమే ప్రజలకు పడుతుంది. అందుకే వైయస్ రాజశేఖర రెడ్డికి ప్రజల్లో ఆదరణ ఉంది. ఆ ఆదరణ వైయస్ జగన్‌కు ఉపయోగపడుతోంది. ఈ రకంగా వైయస్ వారసత్వం జగన్‌కు దక్కింది గానీ కాంగ్రెసుకు దక్కలేదు.












Click it and Unblock the Notifications