రాఘవేంద్రరావుకు దెబ్బ: సినీమాక్స్ ల్యాండ్ వెనక్కి

భూమి కేటాయింపును రద్దు చేస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ ఫైల్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే సినీమాక్స్ ల్యాండ్ ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది. దివంగత సంగీత దర్శకుడు చక్రవర్తికి కూడా భూమి కేటాయింపును రద్దు చేస్తూ కూడా సమాచార, పౌర సంబంధాల శాఖ సిఫార్సు చేసింది.
సినీమాక్స్ భూవివాదంపై రాఘవేంద్రరావుకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు, దానికి ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఓ నివేదిక సమర్పించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు రాఘవేంద్రరావుకు భూమి కేటాయింపును రద్దు చేస్తూ సమాచార, పౌరసంబంధాల శాఖ సిఫార్సు చేసినట్లు సమాచారం.
కాంగ్రెసు శాసనసభ్యుడు పి విష్ణువర్దన్ రెడ్డి వేసిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తూ - రికార్డింగ్, రీ - రికార్డింగ్ థియేటర్ల నిర్మాణానికి, ఎడిటింగ్, అవుట్ డోర్ యూనిట్ సౌకర్యాల ఏర్పాటుకు రాఘవేంద్రరావుకు, ఆయన సోదురు కె. కృష్ణమోహన్‌కు రెండున్నర ఎకరాలు కేటాయించినట్లు ప్రభుత్వం శాసనసభలో తెలిపింది. మూడు పార్టీలకు కేటాయించిన భూములను తిరిగి తీసుకునే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కూడా ప్రభుత్వం తెలిపింది.
మొదటి ప్రతిపాదనను సవరించి, మినీ థియేటర్స్ నిర్మించుకోవడానికి రాఘవేంద్రరావుకు గతంలో అనుమతి లభించింది. అయితే, ఆయన అందుకు విరుద్ధంగా మాల్‌ను, మల్టీప్లెక్స్ సినీమాక్స్‌ను నిర్మించారు. కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించినందున నిర్మాణాలను ఆపించి, భూమిని స్వాధీనం చేసుకోవాలని 2006 ఏప్రిల్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థ అధికారులను ఆదేశించింది.
తమ వివరణ కోరకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటూ రాఘవేంద్రరావు సోదరులు హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టు కొట్టేసి చట్టప్రకారం వ్యవహరించాలని ఆదేశించింది. దాంతో కలెక్టర్ ద్వారా ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేయించింది. నిర్మాణాలను ఆపేస్తామని రాఘవేంద్రరావు షోకాజ్‌ను సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications