అడ్డం తిరిగిన కిరణ్: తప్పిస్తారా, తప్పుకుంటారా?
రాష్ట్ర విభజన వల్లనే ఎక్కువ సమస్యలు వస్తాయని, నీరు, విద్యుత్, పరిశ్రమలు, విద్య.. తదితరాలకు సమాధానం చెప్పాకనే విభజన అంశంపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి సవాల్‌గానే మారిందని చెప్పవచ్చు. పార్టీ నిర్ణయం ప్రకటించాక కూడా కిరణ్ అడ్డం తిరగడంతో ఆ పార్టీ సంకటస్థితిలో పడింది. తదుపరి ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై అయోమయంలో మునిగింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ముగించి, రాజకీయంగా ఎంతోకొంత లబ్ధి పొందాలన్న అధిష్ఠానం ఎత్తుగడ దీంతో సందిగ్ధంలో పడింది. రాష్ట్ర విభజన మంచిది కాదని తేల్చి చెప్పడమే కాకుండా, అసెంబ్లీలోనూ పూర్తిస్థాయి చర్చ జరగాలంటూ కిరణ్ మెలిక పెట్టడంతో, విభజన ప్రక్రియకు ఆయన సహకరించరన్న విషయం స్పష్టమైందంటున్నారు. తెలంగాణ ఏర్పాటుపై వైఖరిని విస్పష్టం చేయడం ద్వారా కిరణ్... తనను పదవి నుంచి తొలగించడమా? లేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపడమా? తేల్చుకోవాల్సిన అగత్యాన్ని అధిష్ఠానానికి కల్పించినట్లుగానే భావించవచ్చు.
ఇప్పుడు కిరణ్‌తో రాజీనామా చేయిస్తే, కేబినెట్ రద్దవుతుంది. సీమాంధ్ర నుంచి మరొక నేత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే పరిస్థితి ఎంతమాత్రం లేదు. ఒకవేళ తెలంగాణ నేతల్లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా నియమించినా, సీమాంధ్ర నుంచి ఏ ఒక్కరూ మంత్రి మండలిలో చేరే అవకాశం లేదు. అంటే రాష్ట్రంలో అసలు ప్రజా ప్రభుత్వమే లేని స్థితి ఏర్పడొచ్చు. లేదా సీమాంధ్రకు ప్రాతినిధ్యమే లేని ప్రభుత్వమైనా ఏర్పడొచ్చు.
ఇలాంటి ఏకపక్ష వాతావరణం ఏర్పడితే కేంద్రం లేదా కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర విభజన ప్రక్రియను ఎంత వరకు ముందుకు తీసుకువెళ్లగలుగుతుందనేది అసలు ప్రశ్న. కిరణ్‌ను దారికి తెచ్చుకోవడం, కాదంటే రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించడం, అందుకు నిరాకరిస్తే ఆయనను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి విభజనకు ముందుకెళ్లడం... ఢిల్లీ పెద్దల ముందున్న మార్గాలు.
కాంగ్రెసు పార్టీ నిర్ణయం ప్రకటించాక కూడా కిరణ్ ప్రెస్ మీట్‌లో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆయనను దారికి తెచ్చుకోవడం కష్టమనే విషయం దాదాపు తేలిపోయింది. ఇక రాజీనామా చేయించినా లేక బర్తరఫ్ చేయించినా సొంత పార్టీ ముఖ్యమంత్రి అభిప్రాయాన్నే పట్టించుకోకుండా, పార్టీ ప్రభుత్వాన్నే కూల్చివేసి, రాష్ట్రాన్ని విభజించిన అపఖ్యాతి తప్పదు. ఇప్పటికే రగులుతున్న సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌పై మరింత భగ్గుమంటారు.
కిరణ్‌తో రాజీనామా చేయించినా, బర్తరఫ్ చేసినా సీమాంధ్రలో కిరణ్ హీరోగా మారిపోతారు. కిరణ్‌ను తప్పిస్తే పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అదే దారిలో నడిచే అవకాశాలున్నాయి. అప్పుడు నిర్ణయాన్ని తాత్కాలికంగానైనా ఆపక తప్పదంటున్నారు. ప్రస్తుతానికి ఎంతో కొంత రాజీపడి కిరణ్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలనుకున్నా కూడా హైకమాండ్‌కు ఇబ్బందులు తప్పేలా లేవు.
విభజనకు తాను వ్యతిరేకమని కిరణ్ బహిరంగంగానే స్పష్టం చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన నాయకత్వాన్ని ఎంతమాత్రం ఆమోదించకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితిని తెరాస, బిజెపిలు తనకు అనుకూలంగా మలచుకునే అవకాశమున్న నేపథ్యంలో తెలంగాణ నేతలు సైతం ధిక్కార మార్గాన్ని ఎంచుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందనే చెప్పవచ్చు.
కిరణ్ మాటల తీరును బట్టి.. అది ధిక్కార ధోరణేనని, ఆయనను తప్పించినా తప్పించవచ్చునని తెలంగాణ నేతలు భావిస్తున్నారు. మరోవైపు కిరణ్‌ను పక్కన పెడితే ఆ ప్రభావం కేంద్రం పైనా పడే అవకాశముంది. కిరణ్ వైఖరితో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలపైనా ఒత్తిడి పెరగడం తథ్యం. ఇప్పటికే సమైక్య ఉద్యమకారులు మంత్రులు, ఎంపీల రాజీనామాల కోసం పట్టుబడుతున్నారు.












Click it and Unblock the Notifications