తెలంగాణపై కిరణ్ ప్యాకేజీ: తిప్పికొట్టిన సోనియా

ఆ పత్రిక కథనం ప్రకారం - గత గురువారంనాడు కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీతో సమావేశానికి వేచి చూస్తూ, చివరకు కలవకుండానే హైదరాబాదు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణకు ప్యాకేజీ ప్రకటిస్తే తాను పార్టీలోనూ బయటా సమస్యలు రాకుండా చూస్తానని కిరణ్ కుమార్ రెడ్డి సోనియాకు చెప్పదలుచుకున్నారు. ఆ ప్యాకేజీ వివరాలను చెప్పడానికి ఆయన సోనియాను కలవదలుచుకున్నారు.
ప్యాకేజీల ఊసు అవసరం లేదని, వాటి గురించి వినదలుచుకోలేదని సోనియా గాంధీ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో చెప్పినట్లు తెలిసింది. ప్యాకేజీ ఫార్ములాతో సోనియాను ఒప్పించగలలనే ధీమాతో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. సోనియా దర్శనం కోసం వేచి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని గత బుధవారం ఎపి భవన్‌లో దిగ్విజయ్ సింగ్ కలిశారు.
సోనియా అభిమతాన్ని దిగ్విజయ్ సింగ్ కిరణ్ కుమార్ రెడ్డికి వివరించారు. పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనకు సిద్ధపడిందని, ప్యాకేజీల మాట వినదలుచుకోలేదని, భవిష్యత్తు పరిణామాలకు సిద్దపపడాలని దిగ్విజయ్ సింగ్ కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. వీరిరువురి మధ్య దాదాపు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది.
దిగ్విజయ్ సింగ్ మాటలతో విషయాన్ని అర్థం చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి గురువారంనాడు హైదరాబాదుకు తిరిగి వచ్చారు. ఆయన తిరిగి వచ్చేసరికి కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు సిద్ధపడిందనే వార్తలు గుప్పుమన్నాయి. సమైక్యవాది అయిన కిరణ్ కుమార్ రెడ్డి విభజన అంశాన్ని ఎలా జీర్ణం చేసుకుంటారనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications