హైదరాబాద్: సీమాంధ్ర ఆందోళనపై డిప్యూటీ సిద్ధం!

రాష్ట్రం విడిపోయినా హైదరాబాదులో అందరికీ భద్రత ఉంటుందని ఢిల్లీ పెద్దలకు చెప్పాలని దామోదరకు తెలంగాణ కాంగ్రెసు నేతలు సూచించారట. ఆయన కూడా అందుకు అనుగుణంగా రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారని చెబుతున్నారు. సీమాంధ్ర నేతల ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని వేసే ప్రశ్నల్లో రాయల తెలంగాణ ప్రతిపాదన, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం, వనరుల పంపకం, ఆదాయం, తదితరాలు ఉండవచ్చునని టి కాంగ్రెసు నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రశ్నలన్నింటికీ పకడ్బంధీగా సమాధానాలతో సమాయత్తం కావాలని దామోదరకు సూచించడమే కాకుండా, తెలంగాణకు గతంలో ఇచ్చిన హామీల ఉల్లంఘన వంటి ప్రస్తావన నివేదికలో ఉండనుంది. కోర్ కమిటీ వేసే ప్రశ్నలకు పూర్తిగా సిద్ధం కావాలని దామోదరకు నేతలు సహకరిస్తున్నారు. ఆదివారం ఈ విషయమై కాంగ్రెసు నేతలు దామోదరతో భేటీ అయ్యారు. మొత్తం ఎనిమిది మంది మంత్రులు, నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ప్రజా సంఘాల జెఏసి, ఓయు జెఏసి నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోమవారం మంత్రి జానా రెడ్డి ఇంటిలో చర్చించనున్నారు.
హైదరాబాదును ఉమ్మడి రాజధానికి అంగీకరించే ప్రసక్తే లేదని, రెండేళ్లపాటు కేంద్ర పరిపాలన ప్రాంతంగా ఉంచి సెటిలర్లకు భద్రత కల్పించవచ్చని ఆదివారం నాటి భేటీలో అభిప్రాయపడ్డారు. సెటిలర్లకు అనుమానాలు, అపోహలు ఉంటే దీని ఏర్పాటు ద్వారా వాటిని పోగొట్టవచ్చని సూచించారు. ఆదాయ వనరులు, సాగునీటి పంపిణీ, ఉమ్మడి రాజధాని వివాదం, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. రాయల తెలంగాణకు కూడా ఒప్పుకొనేది లేదని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ కోసమే అధిష్ఠానం వద్ద పట్టుబట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
రాష్ట్ర విభజన వల్ల ప్రధానంగా రాజధాని, సాగునీరు, ఆదాయ పంపిణీ, ఉద్యోగులకు సంబంధించిన వివాదాలు ఉంటాయని, వీటిని పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ నెల 8, 9 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) జానారెడ్డి ఇంటినే వార్ రూమ్‌గా చేసుకుని అక్కడి నుంచే కార్యకలాపాలను నిర్వహిద్దామని నిర్ణయించారు. పదో తేదీ నాటికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహా, సూచనలు సేకరించి అధిష్ఠానానికి నివేదించాలని నిర్ణయించారు.
కాగా తెలంగాణపై అధిష్ఠానానికి సమర్పించేది రోడ్ మ్యాప్ కాదని, అది నివేదిక మాత్రమేనని తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై మంత్రి గీతా రెడ్డి తన నివాసంలో తెలంగాణ మేధావుల ఫోరంతో చర్చించారు. రోడ్‌మ్యాప్ రూపకల్పనలో భాగంగా డిప్యూటీ సిఎం రాజనరసింహ ఆదివారం మంత్రుల క్లబ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన తర్వాత.. ఫోరం సభ్యులు కమలాకర్, గౌతమ్ పింగ్లే, రమేశ్ రెడ్డి తదితరులు గీతా రెడ్డితో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications