జైల్లో ఏడాది: జగన్ ఎగిసి 'పడుతున్నారా'?(పిక్చర్స్)
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్‌గూడ జైలులో ఏడాది పూర్తి చేసుకున్నారు. ఆయనను సిబిఐ గతేడాది మే 27న అరెస్టు చేసింది. ఆదివారంతో ఏడాది పూర్తయింది. జగన్ అరెస్టై ఏడాది పూర్తయినందున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.
జగన్ అరెస్ట్ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ కుట్రలో భాగమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొదటి నుండి ఆరోపిస్తోంది. జగన్ పార్టీ స్థాపించాక చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని, జగన్‌ను దెబ్బతీసేందుకు ఇరువురు ఒక్కటయ్యారనేది వారి ఆరోపణ. జగన్‌ను దెబ్బతీసేందుకు సిబిఐని కాంగ్రెసు పార్టీ ఉపయోగించుకుంటోందని చెబుతున్నారు. కుట్రలో భాగంగానే జగన్‌కు బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
వీరు ఆరోపణలను మాత్రం కాంగ్రెసు తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. సిబిఐ విచారణతో తమకేం సంబంధం లేదని కాంగ్రెసు అంటే, తాము కాంగ్రెసుతో ఫిక్సింగ్ చేసుకునే ప్రసక్తే లేదని టిడిపి చెబుతోంది. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసులను తాము వ్యతిరేకిస్తామని, తాము జగన్ అవినీతి పైనే పోరాడటం లేదని, వైయస్ ఉన్నప్పటి నుండి వీరి అవినితిపై పోరాడుతున్నామని టిడిపి వివరణ ఇస్తోంది.
జగన్ బయట ఉండగా ఓదార్పు యాత్రతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన అరెస్టయ్యాక విజయమ్మ నేతృత్వంలో పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అడపాదడపా విజయమ్మ దీక్షలు చేస్తుండగా.. షర్మిల పార్టీని నిత్యం ప్రజల్లో ఉంచేందుకు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. జగన్‌కు బెయిల్ వస్తుందని ఏడాదిగా పలుమార్లు పార్టీ చూసింది. కానీ ఎప్పటికప్పుడు వారికి నిరాశే ఎదురవుతోంది. దీంతో క్యాడర్‌లో క్రమంగా ఉత్సాహం సన్నగిల్లుతోంది.
పార్టీలో ఉత్సాహం తీసుకు వచ్చేందుకు నేతలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ లోపల ఉండటం పార్టీకి ఓ మైనస్ అయితే.. పార్టీలో అంతర్గత విభేదాలు, మొదటి నుండి పని చేస్తున్న వారికి కాకుండా కొత్తగా వస్తున్న వారికి టిక్కెట్ హామీ, నేతల అనుభవరాహిత్యం తదితరాలు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే సెంటిమెంట్ తదితర అంశాలు తమను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని పలువురు భావిస్తున్నారు.

జగన్ జైలుకు వెళ్లి ఆదివారంతో ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో ఆయన బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. వచ్చే సెప్టెంబరులో ఆయన మరోసారి బెయిల్ పిటిషన్ వేసే అవకాశముంది. అయితే సిబిఐ మరోసారి పొడిగించే అవకాశాలు కూడా కొట్టి పారేయలేం.

కాంగ్రెసులో ఉండగా వ్యక్తిగతంగా బలపడేందుకు, పార్టీ స్థాపించాక పార్టీ కోసం ఆయన ఓదార్పు యాత్రను జోరుగా చేపట్టారు. కాంగ్రెసు పార్టీకి, పదవులకు రాజీనామా చేశాక.. జగన్, విజయమ్మలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ భారీ విజయానికి సెంటిమెంటే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

జగన్ జైలుకు వెళ్లాక పార్టీ బలోపేతం కోసం విజయమ్మ ఆధ్వర్యంలో పలు దీక్షా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీని గ్రామస్థాయికి తీసుకు వెళ్లేందుకు షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రను చేస్తున్నారు. దీంతో జగన్ లేని లోటును వారు పూడ్చుతున్నారు.

షర్మిల, విజయమ్మలు ఎంతగా కష్టపడుతున్నప్పటికీ జగన్ జైలులో ఉండటం పార్టీలో కొంతలో కొంత నిస్తేజం కనిపిస్తోంది. ప్రతిసారి బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకోవడం.. తీరా బెయిల్ రాకపోవడంతో నేతల నుండి కార్యకర్తల వరకు కొంత బాధ, నిస్తేజం కనిపిస్తోంది. బెయిల్ పిటిషన్ తీర్పుకు ముందు ఆ పార్టీలో ఉత్సాహం.. రాలేదని తెలిశాక నిస్తేజం ఛాయలు కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్‌కు బెయిల్ కోసం జగన్ పార్టీ ఢిల్లీ చుట్టు ప్రదక్షిణలు చేస్తోందని టిడిపి ఆరోపిస్తోంది.

జగన్ బయట ఉన్నా లోపల ఉన్నా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పలుమార్లు జరిగిన ఉప ఎన్నికలలో విజయఢంకా మోగించింది.

కాంగ్రెసు, టిడిపిల మధ్య మ్యాచ్ పిక్సింగ్ వల్లనే బెయిల్ రావడంలేదనేది జగన్ పార్టీ ప్రధాన ఆరోపణ.

జగన్ పార్టీలో అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మైసూరా రెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ అసెంబ్లీలో, బయట వారి అనుభవంలేని తీరు కనిపించింది. సభలో ఎస్సీ వర్గీకరణపై, బయట ఘాటైన ఆరోపణలకు వివరణ ఇవ్వకపోగా ఎదురుదాడిని మాత్రమే సాగిస్తున్నారని అంటున్నారు.

పార్టీలు క్రమంగా అసంతృప్తి జ్వాలలు కూడా పెరుగుతున్నాయి. ఆధిపత్య పోరు, మొదటి నుండి పని చేస్తున్న ఆశావహులకు కాకుండా కొత్తవారికి హామీలు ఇవ్వడం లాంటివి పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

జగన్ బయటకు వస్తే వచ్చే ఎన్నికలలో తమ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. వచ్చే సెప్టెంబరులో కూడా జగన్‌కు బెయిల్ రాకుంటే క్యాడర్‌లో ఆందోళన తప్పదంటున్నారు. ఎందుకంటే ఆ తర్వాత మరో ఆరు నెలలకు సాధారణ ఎన్నికలు రానున్నాయి.












Click it and Unblock the Notifications