రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు: ఓటర్ల జాబితా సిద్ధమే!?

అదే సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారిస్తోంది. విభజన అంశంపై కేంద్ర నిర్ణయమే తరువాయని, వెంటనే తాము సిద్ధమవుతామని కూడా ఈసి వర్గాలు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించే అంశంపైనా కసరత్తు చేస్తోందట. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న భన్వర్‌లాల్ స్థానంలో కొత్తవారిని నియమిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయననే 2014 ఎన్నికల వరకు కొనసాగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందట.
విభజన జరిగితే తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించే బాధ్యతను కూడా ప్రస్తుత రాష్ట్ర సిఇఓకే అప్పగించాలని కూడా నిర్ణయించారట. రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాలకు రెండు వేర్వేరు అధికార యంత్రాంగాలు ఉంటాయి. మొత్తం పాలనా బాధ్యత వారే చూసుకుంటారు. అయితే ఎన్నికల నిర్వహణ అంశం ఒక్కటి మాత్రం సంయుక్త అధికారి నేతృత్వంలో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందట.
ఇదే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే సంకేతాలు పంపించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల జాబితాలు కూడా విడివిడిగానే సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇది ఇబ్బందికరమైన అంశం కాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. ఇప్పటికే 23 జిల్లాలకు సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఉందని, రాష్ట్ర విభజన ప్రకటన పూర్తయితే పది జిల్లాలకు ఒక జాబితా, 13 జిల్లాలకు ఒక జాబితా విడదీసి చూపించడమే తరువాయట.












Click it and Unblock the Notifications