సిఎం అభ్యర్థి: రజనీకాంత్‌కు బిజెపి గాలం?
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తన వైపు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా రజనీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా చెబుతున్నారు.
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల బిజెపి సీనియర్ నేత ఒకరు కూడా ఆయనను కలిసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను బిజెపిలోకి తీసుకుని వచ్చే బాధ్యతను మోడీ అమిత్ షాకు అప్పగించినట్లు చెబుతున్నారు 2016 శాసనసభ ఎన్నికల్లో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మోడీ వ్యూహరచన చేశారని, రజనీకాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల సమరంలోకి దిగాలని మోడీ భావిస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి, అన్నాడియంకె నేత జయలలితను ఎదుర్కోవడానికి రజనీకాంత్ మాత్రమే పనికి వస్తారని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం. వివిధ పథకాల ద్వారా తమిళనాడులో పాతుకుపోతున్న జయలలితను రజనీకాంత్ అభిమానులతో దెబ్బ కొట్టాలనే వ్యూహంతో బిజెపి భావిస్తోంది.
‘లింగా' షూటింగులో భాగంగా ఇటీవల మంగుళూరు వచ్చిన రజనీకాంత్ ను ఓ రిపోర్టరు రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా రజనీ స్పందిస్తూ....‘దేవుడు నడిపిస్తే ఆ వైపు తప్పకుండా నడుస్తాను' అని స్పందించారు. మొత్తానికి రజనీకాంత్ రాజకీయాలపై నొప్పించక, తానొవ్వక అన్నట్లు వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications