కాపు వ్యతిరేకత: దిగొచ్చిన సిఎం చంద్రబాబు
హైదరాబాద్: కాపు భవనాలకు చంద్రన్న భవన్‌గా పేరు పెట్టాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకున్నారు. కాపు సామాజికవర్గం నేతల నుంచే కాకుండా ఇతర పార్టీనేతల నుంచి విమర్శలు రావడంతో ఆయన తన వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు.
గుంటూరులో నిర్మించనున్న కాపు భవనానికి చంద్రన్న భవన్‌గా నామకరణం చేయడాన్ని సొంత మంత్రులే తప్పుపడుతున్నారని, వారితోపాటు టిడిపికి మద్దతునిస్తున్న కాపులు కూడా తాజా నిర్ణయాలతో పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
దాంతో రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌రావు, నగర నేత విక్రమ్‌నాగు, ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు చంద్రబాబును ఆదివారం కలిశారు. తమ కుల సంఘ భవనాలకు మీ పేరు పెట్టడం సబబు కాదని, దానివల్ల మీ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న కాపులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని పిళ్లా అభ్యంతరం వ్యక్తం చేశారు.

చంద్రన్న భవన్ పేరు పెట్టడం వల్ల కాపుల ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాపు భవనాలకు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా, రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి ప్రముఖుల పేర్లు పెట్టాలనివారు సూచించారు. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెట్టడాన్ని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ కూడా తప్పుపట్టారు. దాన్ని ఉపసంహరించుకోకపోతే, ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాగా ఆదివారంనాడే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికార ప్రకటన కూడా వెలువడింది. సీఎంఓ అనుమతి లేకుండాప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టవద్దని ఆదేశించింది. ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటి పేర్లు పెట్టవద్దని ఆదేశించింది.












Click it and Unblock the Notifications