జగన్-పవన్-లోకేష్.. ఈ ముగ్గురిలో తేడా ఎక్కడుందంటే!
విజయవాడ : నిన్న మొన్నటిదాకా రెండు పార్టీలకే పరిమితమైన ఏపీ పాలిటిక్స్.. పొలిటికల్ గా పవన్ యాక్టివ్ అవడంతో.. మూడు ముక్కలాటగా మారింది. కాబట్టి.. ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితుల గురించి అంచనా వేయాలంటే.. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ ను కూడా పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.

ముగ్గురూ.. విద్యార్థులతో మమేకమవడానికి ప్రయత్నిస్తున్నారు :
పవన్ పొలిటికల్ ఎంట్రీ వల్ల ఎవరికి నష్టం అన్న సంగతి పక్కనబెడితే.. భవిష్యత్తులో ఏపీ రాజకీయాలను శాసించాలని కలలు గంటున్న వైసీపీ అధినేత జగన్ కు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఉన్న రాజకీయ లక్షణాలను ఇప్పుడు పవన్ తో పోల్చి చూడడం పరిపాటిగా మారింది. కొద్దిరోజులుగా ఈ ముగ్గురు నేతల యాక్టివిటీని గమనిస్తే.. యువతలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

పవన్ ఇకముందు కూడా కొనసాగిస్తారా?
యువభేరీల పేరిట జగన్, ముఖాముఖిల పేరిట లోకేష్, పవన్ లు విద్యార్థులతో కనెక్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే విద్యార్థులతో మమేకమవడానికి జగన్, లోకేష్ లు చేస్తున్న ప్రయత్నాలు పార్టీల తరుపున ముందస్తు ప్లాన్ ప్రకారం జరుగుతున్నవే. పవన్ విషయానికొస్తే.. గేట్ కాలేజీ యాజమాన్యం అభ్యర్థన మేరకు మొన్నటి ముఖాముఖిలో పాల్గొన్నట్టు వెల్లడించారు. ఇకముందు అలాంటి మరిన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు.

లోకేష్ కాస్త వీక్ :
ఈ సంగతంతా ఎలా ఉన్నా.. విద్యార్థులతో కనెక్ట్ అయ్యే విషయంలో ఈ ముగ్గురి మాటతీరును పరిశీలిస్తే.. జగన్, లోకేష్ ల కంటే పవనే కాస్తంత ముందున్నాడన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. లోకేష్ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉందనేది పలువురి అభిప్రాయం. విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమాలు ప్రీ ప్లాన్డ్ గానే చేస్తున్నప్పటికీ.. విద్యార్థులకు సరైన సమాధానాలు చెప్పడంలో లోకేష్ అంతగా ఆకట్టుకోవడం లేదనేది అంతర్గతంగా వినిపిస్తున్న మాట.

జగన్ మరిన్ని కసరత్తులు చేయాలేమో!
ఇక జగన్ విషయానికొస్తే.. యువభేరీ లాంటి కార్యక్రమాలు వైసీపీకి ఎంతమేర పొలిటికల్ మైలేజీ ఇస్తున్నాయన్నది తెలియదు గానీ.. తన సమాధానాలతో యువతను ఆకట్టుకోవడంలో జగన్ మరిన్ని కసరత్తులు చేయాల్సి ఉంది. తన ఆలోచనలను, భవిష్యత్తు కార్యాచరణను.. స్పష్టంగా జనం ముందుంచాల్సిన అవసరముంది. చంద్రబాబును టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోకుండా.. సమస్యల పట్ల తనదైన ఆలోచనా దృక్పథాన్ని విద్యార్థుల ముందు ఆవిష్కరించాల్సి ఉంది.

ప్రస్తుతానికి పవన్ ఓకె :
ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మొన్నటి అనంత సభతో జనంలో మంచి మార్కులే పడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలియని విషయాలను నాన్చకుండా.. తెలియదంటూ సూటిగా చెప్పేయడం.. వాటి గురించి అధ్యయనం చేస్తానని చెప్పడం పలువురిని ఆకట్టుకుంది. పవన్ విషయంలో గమనించాల్సిన మరో కీలక విషయమేంటంటే.. ఉన్నపలంగా సీఎం పీఠాన్ని ఎక్కాలన్న ఆత్రుత ఆయనలో లేదు. కాబట్టి.. పక్కా ప్లానింగ్ తో ఒక్కో అడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.మొత్తంగా.. ఏపీ భవిష్యత్తు రాజకీయాల్లో ఈ ముగ్గురి పాత్ర కీలకంగా మారే అవకాశముండడంతో.. ఇప్పటినుంచే వీరి నడుమ పోటీ తీవ్రతరమయ్యే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతిమంగా ఎవరైతే ప్రజా నాడిని సరిగా అంచనా వేసి.. సరైన ప్రణాలికలతో ముందుకెళ్తారో.. విజయం వారినే వరించడం ఖాయం.












Click it and Unblock the Notifications