హైదరాబాద్‌పై చంద్రబాబుకు అధికారం ఉంటుందా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో సెక్షన్ 8 ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు హైదరాబాదుపై ఎంత అధికారం ఉందో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనకూ అంతే అధికారం ఉందని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఆ వాదన నిలబడుతుందా అనేది ప్రశ్న. సెక్షన్ 8 ఏం చెబుతుందనేది చూస్తే ఆశ్చర్యకమైన విషయాలు వెలుగు చూస్తాయి. అదే రీతిలో గవర్నర్‌కు హైదరాబాదుపై పూర్తి అధికారాలు ఉంటాయా అనేది కూడా ప్రశ్ననే.
నోటుకు ఓటు కేసులో ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు అవినీతికి పురికొల్పుతున్నారనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా హైదరాబాదుపై అధికారాలను ప్రశ్నిస్తూ, సమస్యను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మే 31వ తేదీన తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎసిబికి దొరికినప్పుడు హైదరాబాదుపై అధికారాల గురించి ప్రశ్న రాలేదు. జూన్ 7వ తేదీన నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో విడుదలైన తర్వాత ఆ ప్రశ్నను ముందుకు తెచ్చారు.
తెలంగాణ ఎసిబికి తనపై చర్యలు తీసుకునే అధికారం లేదని, ఉమ్మడి రాజధానిలో సమానమైన అధికారాలున్నాయని, ఉమ్మడి రాజధానిలో కెసిఆర్‌కు ఎసిబి ఉన్నట్లుగానే తనకు కూడా ఎసిబి ఉందని చంద్రబాబు వాదిస్తూ వస్తున్నారు. తన ఫోన్‌ను ట్యాప్ చేసి తన స్వేచ్ఛకు భంగం కలిగించారని ఆరోపిస్తూ అందువల్ల సెక్షన్ 8ను అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం తన పరిధిని ఉల్లంఘించి, తన స్వేచ్ఛకు భంగం కలిగించిందనేది చంద్రబాబు ఆరోపణ. నిజానికి, హైదరాబాదులో చాలా మంది ఆంధ్ర ప్రజలు ఉన్నారని, రాష్ట్రాన్ని విభజిస్తే వారి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని భయాందోళనలను వ్యక్తం చేశారు. దానికోసం చట్టంలో సెక్షన్ 8ను దాంట్లో చేర్చారు.
హైదరాబాదులో నివసించే ప్రజల భద్రతకు, స్వేచ్ఛకు, ఆస్తుల సంరక్షణకు ఆపాయింటెడ్ డే నుంచి గవర్నర్ ప్రత్యేక బాధ్యత తీసుకుంటారనేది సెక్షన్ 8లో ఉంది. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో గవర్నర్ శాంతిభద్రతలను, అంతర్గత భద్రతను, ముఖ్యమైన సంస్థల భద్రతను, ప్రభుత్వ భవనాల నిర్వహణా కేటాయింపు బాధ్యతలను తీసుకుంటారు.
ఆ విషయాల్లో గవర్నర్ తన కార్యనిర్వహణకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని సంప్రదించి, తన వ్యక్తిగత నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, గవర్నర్ నిర్ణయం తుది తీర్పు అవుతుంది. ఈ విషయాల్లో గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం నియమించే ఇచ్చే సలహాదారులు సహాయం అందిస్తారు.
ఆ విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే హైదరాబాదులో శాంతిభద్రతలపై అధికారాన్ని సెక్షన్ 8 గవర్నర్‌కు కట్టబెట్టలేదనేది అర్థమవుతుంది. ప్రత్యేక బాధ్యత తీసుకుంటారని మాత్రమే ఉంది. సెక్షన్‌లో భద్రత విషయంలో అధికారం అనే పదాన్ని వాడకుండా ప్రత్యేక బాధ్యత అని మాత్రమే వాడారు. సబ్‌సెక్షన్ 2 ప్రకారం గవర్నర్ శాంతిభద్రతలపై సొంతంగా వ్యవహరించలేరు. ఆ బాధ్యతలను నిర్వర్తించే ముందు గవర్నర్ తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే, తన నిర్ణయాన్ని అమలు చేసే విచక్షణాధికారం మాత్రం గవర్నర్‌కు ఉంటుంది. ఆయనకు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ సలహాదారులు సహకరిస్తారు.
హైదరాబాదులో అవాంఛనీయమైన సంఘటనలు ఏవీ జరగలేదు కాబట్టి అటువంటి పరిస్థితి ఈ ఏడాది కాలంలో రాలేదు. పైగా, పాలనానిర్వహణ బాధ్యతను మాత్రమే గవర్నర్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ అధికారాలను ఆ విధంగా పరిమితం చేశారు.
హైదరాబాదు శాంతిభద్రతలపై తెలంగాణ ప్రభుత్వ అధికారాలను గుండుగుత్తగా గవర్నర్‌కు కట్టబెట్టలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నర్ చర్యలు తీసుకోదలుచుకుంటే, తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించాలి లేదా తన విచక్షణాధికారాలను వాడాలి. అంతేగానీ, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలికి గానీ ముఖ్యమంత్రికి గానీ ఏ విధమైన పాత్ర కూడా లేదు.
మొత్తం అధికారాలను గవర్నర్‌కు బదిలీ చేశారనే అపోహతో తెలంగాణ ఎసిబి అధికారాలు కూడా గవర్నర్‌కు దారాదత్తం చేశారనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో మాదిరిగా కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న అధికారాలు ఉన్నాయి.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు పదేళ్లు అనే గ్యారంటీ కూడా లేదు. పదేళ్లకు మించకుండా అనేదే ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉంది. పదేళ్ల లోపు ఆంధ్రప్రదేశ్ రాజధాని మారిపోతే, హైదరాబాదు ఉమ్మడి రాజధాని అనే నిబంధన తొలిగిపోతుంది. హైదరాబాదుపై ఏ విధమైన అధికారాలు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాదులో ఉండే వెసులుబాటును మాత్రమే చట్టం, ఆ సెక్షన్ కల్పిస్తున్నాయి.
అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి అధికారాలను తీసుకోవాలని గవర్నర్‌ను అడిగే అధికారం మరో రాష్ట్ర ప్రభుదత్వానికి గానీ, మరో రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ లేదు. పైగా, సెక్షన్ 8లో ఉన్న నిబంధనలు వ్యక్తులు నేరాలు చేస్తే కప్పిపుచ్చాలని చెప్పడం లేదు. అవినీతిపై చర్యలు తీసుకునే అధికారం కచ్చితంగా తెలంగాణ ఎసిబికి ఉంది. అందువల్ల చంద్రబాబు చేసే వాదనలు నోటుకు ఓటు కేసులో ఏ మాత్రం నిలవవు.












Click it and Unblock the Notifications