మురళీమోహన్ ఎఫెక్ట్: 'మా' ఎన్నికల్లో తలసాని చక్రం
హైదరాబాద్: 'మా' ఎన్నికల్లో హైదరాబాదుకు చెందిన ముఖ్య నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చక్రం తిప్పారా? తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్‌కు చెక్ చెప్పేందుకు తెరాస నేత పావులు కదిపారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
'మా' సభ్యుడు కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన వ్యాఖ్యల ద్వారా పలు పై వాదనలు వినిపిస్తున్నాయి. 'మా' ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతోనే విజయం సాధించామని ఆయన చెప్పారు.
'మా' ఎన్నికల్లో పసికూనలు సింహాలతో తలపడ్డాయన్నారు. విభజన తర్వాత అన్ని శాఖల ఉద్యోగులు ఏఏ రాష్ట్రానికి చెందుతారో తేలిపోయిందని కానీ, సినిమా పరిశ్రమ మాత్రం ఏ రాష్ట్రమో, ఏ ప్రాంతమో తెలియని స్థితిలో ఉందన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు సినిమా రంగ అభివృద్ధిపై సానుకూల దృక్పథంతో ఉన్నారన్నారు.

ఇటీవల మా ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్, జయసుధలు తలపడిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్ వర్గానికి నాగబాబు తదితరులు మద్దతిచ్చారు. జయసుధ వర్గానికి మురళీ మోహన్ వంటి నేతలు అండగా నిలిచారు. జయసుధ గెలుస్తుందని తొలి నుండి అందరూ భావించారు.
కానీ, అనూహ్యంగా రాజేంద్ర ప్రసాద్ మంచి మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో తలసాని జోక్యం వల్లనే మంచి మెజార్టీ వచ్చి ఉంటుందని తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని అంటున్నారు. టీడీపీ నేత అయిన మురళీ మోహన్‌కు చెక్ చెప్పేందుకు తలసాని రంగంలోకి దిగారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications