ఇంటర్నెట్ సెర్చ్: చంద్రబాబు కన్నా కెసిఆర్ టాప్

హైదరాబాద్: టెక్ సావీ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కన్నా ఇంటర్నెట్ సెర్చ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుదే పైచేయిగా ఉంది. నిరుడు ఆన్‌లైన్ పాపులారిటీలో కెసిఆర్ చంద్రబాబును అధిగమించారు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వారి ఆన్‌లైన్ పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీతో పోలిస్తే వారిద్దరి పాపులారిటీ కూడా తక్కువే ఉంది.
గత రెండేళ్లుగా కెసిఆర్, చంద్రబాబులను ఆన్‌లైన్ యూజర్స్ సమానంగా సెర్చ్ చేస్తున్నారు. కానీ, 2014లో అకస్మాత్తుగా కెసిఆర్ పాపులారిటీ పెరిగిపోయింది. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం - నిరుడు మే, జూన్ నెలల్లో చంద్రబాబు పేరును ఎక్కువగా సెర్చ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత ఆ పరిణామం చోటు చేసుకుంది.
కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన 2009 డిసెంబర్‌లో ఆయన ఇంటర్నెట్ సెర్చ్‌లో అత్యధిక స్థితికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అదే ఏడాది యుపిఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్‌లో చంద్రబాబు, కెసిఆర్ ఇరువురు కూడా ఇంటర్నెట్ సెర్చ్‌లో తగ్గుతూ వచ్చారు.
చంద్రబాబు నాయుడు ఇంటర్నెట్ సెర్చ్‌లో కెసిఆర్ కన్నా ఎక్కువగా తగ్గుతూ వచ్చారని అర్థమవుతోంది. గత ఆరు నెలల్లో కెసిఆర్ సెర్చ్ అప్పుడప్పుడూ ఒక్కసారిగా పెరగడం, తగ్గడం జరుగుతూ వచ్చింది. కెసిఆర్ పేరును సెర్చ్ చేసిన వాళ్లు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ఎపి నగరాలకు పరిమితమయ్యారు. కాగా, చంద్రబాబు కోసం సెర్చ్ చేసినవాళ్లు నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదుల్లో కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications