టి బిల్లులో ఆ ఐదు గాయబ్: ఏం చేద్దాం?

అన్ని అంశాలను లోతుగా పరిశీలించి, మంచి చెడులను చర్చించి, భవిష్యత్తులో తలెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదా పకడ్బందీగా రూపొందించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అత్యంత కీలకమైన ముసాయిదా బిల్లులో ఏకంగా ఐదు నియోజకవర్గాలు గల్లంతు కావడమేమిటంటున్నారు.
ముసాయిదా బిల్లులోని రెండో షెడ్యూలులో తెలంగాణ రాష్ట్రంలో ఉండబోయే పార్లమెంటరీ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను కేంద్ర హోంశాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయని పీఠికలో స్పష్టంగా చెప్పారు. కానీ రెండో షెడ్యూలులో మాత్రం ఐదు నియోజకవర్గాలను మాయం చేశారు.
పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ధర్మపురి, జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కామారెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్, నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్, భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గల్లంతు చేశారు. తద్వారా తెలంగాణలో 114 నియోజకవర్గాలే ఉన్నట్లు చూపించారు. దీనిపై వివరణ కోరాలా లేక సవరణ చేయాలా అనే చర్చ సాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో కనీసం 35 నుంచి 56 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. నియోజకవర్గాల పెంపును ముసాయిదా బిల్లులోనే ప్రస్తావించాలని విన్నవించారు. కానీ అసలు ముసాయిదా బిల్లులోనే కొన్ని అసెంబ్లీ స్థానాలు ఐదు తక్కువ కావడమ గమనార్హం. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో ఆ నియోజకవర్గాలు ఉన్నాయా, లేవా అనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications