ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు: ట్రాప్ ఎలా చేశారు?
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయ వర్గం దిమ్మెరపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచం ఇస్తూ ఎసిబి పట్టుబడిన విషయం నమ్మశక్యం కాలేదు. నిజమేనా అనే సంశయం వెన్నాడుతూ వచ్చింది. రేవంత్ రెడ్డిని ఎసిబి కార్యాలయానికి తరలించే వరకు అది నిజమా, కాదా అనే సంశయం వెన్నాడతూ వచ్చింది.

రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎసిబి అధికారులు అత్యంత పకడ్బందీగా పథకం వేసి, ట్రాప్ చేశారనేది అర్థమవుతోంది. అరెస్టు వ్యవహారం బయటకు వచ్చే వరకు వాసన పట్టడానికి కూడా వీలు లేకుండా ఎసిబి అత్యంత గోప్యంగా వ్యవహరించింది. సాక్ష్యాలను కూడా సేకరించి, ఏమీ మాట్లాడడానికి వీలు లేకుండా ఎసిబి వ్యవహరించింది. స్టీఫెన్ సన్ నివాసంలో అన్ని వైపులా సీక్రెట్ కెమెరాలను అమర్చి, ప్రతి కదలిక, ప్రతి మాటా రికార్డు అయ్యే విధంగా చూసినట్లుగా అనిపిస్తోంది.
రేవంత్ రెడ్డిని పట్టించడానికి స్టీఫెన్ ఇంటినిండా అత్యంత రహస్యంగా కెమెరాలు అమర్చినట్లు తెలుస్తోంది. టీవీ చానెళ్లలో ప్రసారమైన వీడియోలను చూస్తే రేవంత్ రెడ్డి పక్కాగా ఇరికిపోయారు. అయితే, వాటిని తాము ఇవ్వలేదని, మీడియాకు తాము వీడియో సీడీలు ఇవ్వలేదని ఎసిబి జెడి ఎకె ఖాన్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపరిచారంటూ ఏసీబీ పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు.

అయితే, తనను అక్రమంగా అరెస్టు చేశారని, రోడ్డుపై ఉంటే కొట్టి లాక్కెళ్లారని, తన వద్ద డబ్బులే లేవని, రూ.50 లక్షలు ఎలా ఇవ్వగలనని రేవంత్ ప్రశ్నించారు. ఇదంతా కేసీఆర్ కుట్ర అని ఆరోపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మీడియా చానళ్లకు కొన్ని వీడియోలు అందాయి. స్టీఫెన్ ఇంట్లో ఆయనతో రేవంత్ మాట్లాడుతున్న వీడియో ఒక్కటి, ఆయనకు డబ్బులు ఇస్తున్న మరో వీడియో టీవీ చానెళ్లకు అందినట్లు కనిపిస్తోంది.
ఒక్కో చానల్‌కు ఒక్కో యాంగిల్‌లో తీసిన వీడియోలు విడుదల చేశారు. దాంతో, స్టీఫెన్ ఇంట్లోని ప్రతి మూలనా ఒక కెమెరాను బిగించి, రేవంత్ మాట్లాడడానికి సంబంధించి ఏ చిన్న అంశాన్నీ వదలకుండా కెమెరాల్లో బిగించారని అంటున్నారు. పక్కాగా ప్లాన్ చేసి రేవంత్ ముఖం మాత్రమే కనిపించేలా కెమెరాలు సెట్ చేశారు. ఒకటి రెండుసార్లు కాకుండా పలుసార్లు ట్రయల్ షూట్ చేసి రేవంత్ మాటలు, వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications